మహేష్ క్వాలిటీతో బన్నీ పోటీపడాలి

మాములుగా సినిమాలు, కలెక్షన్ల గురించి  అభిమానుల మధ్య చర్చలు జరుగుతాయి కానీ వాటికి సంబంధం లేని బిజినెస్ వ్యవహారాల గురించి డిస్కషన్ రావడం చాలా అరుదు. ఈ వారం ఏషియన్ తో కలిసి అల్లు అర్జున్ మొదలుపెట్టబోతున్న మల్టీ ప్లెక్స్ అమీర్ పేట్ సత్యం థియేటర్ కాంప్లెక్స్ స్థానంలో రెడీగా ఉంది. 14న స్వయంగా బన్నీతో పాటు ఇతర ప్రత్యేక అతిథుల మధ్య అయిదు స్క్రీన్లను లాంఛనంగా స్టార్ట్ చేయబోతున్నారు. ఆదిపురుష్ రిలీజ్ ఇందులోనే ఉండబోతోంది. అన్ని తెరలను డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ తో  అత్యాధునిక టెక్నాలజీతో సెట్ చేశారు.

హైదరాబాద్ లో ఇప్పటిదాకా బెస్ట్ మల్టీప్లెక్స్ ఏదంటే టక్కున గుర్తొచ్చే పేరు ఏఎంబి. ఏషియన్ భాగస్వామ్యంలోనే మహేష్ బాబు నడిపిస్తున్న ఈ ఆరు స్క్రీన్ల సముదాయం మొదలు పెట్టిన అతి తక్కువ టైంలోనే బ్లాక్ బస్టర్ అయ్యింది. నగరం మొత్తంలో టికెట్ రేట్లు ఇక్కడే అధికంగా ఉన్నా ప్రేక్షకులు ఎగబడి వస్తుంటారు. వీకెండ్ లో సెల్లార్ నుంచి కారు బయటికి తీయడానికి కనీసం అరగంట పడుతుందంటేనే రష్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య సెలబ్రిటీ షోలు, ఈవెంట్లు అన్నింటికి ప్రసాద్ ని ఓవర్ టేక్ చేసేలా ఏఎంబినే నిలుస్తోంది.

ఇప్పుడు ఏఏఏ సినిమాస్ ఆ స్టాండర్డ్ ని ఖచ్చితంగా మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. పార్ట్ నర్ ఒకరే అయినప్పటికీ వసతులు, సౌండ్, వీడియో, యాంబియన్స్, ఇన్ఫ్రా  స్ట్రక్చర్ అన్నీ ఓ రేంజ్ లో ఉండాలి. ప్రస్తుతానికి చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయి. మాల్ తాలూకు ఫ్లోర్స్ వర్క్ ఆఘమేఘాల మీద చేస్తున్నారు కానీ ఏ టు జెడ్ పూర్తి రూపం రావడానికి ఇంకో రెండు నెలలు పట్టేలా ఉంది. అయితే గచ్చిబౌలితో పోలిస్తే అమీర్ పేట్ సిటీ సెంటర్ లో ఉంది కాబట్టి ఎక్కువ రద్దీ ఉంటుంది. రాబోయే ట్రాఫిక్ జామ్స్ ని తలుచుకుని ఆ రోడ్డులో వ్యాపారస్తులు ఇప్పటికే టెన్షన్ పడుతున్నారు