కరోనా దెబ్బకు ఐదు నెలలకు పైగా దేశవ్యాప్తంగా షూటింగ్స్ ఆగిపోయి ఉన్నాయి. లాక్ డౌన్ షరతులు సడలించాక కొన్ని నియమ నిబంధనల మధ్య షూటింగ్స్ చేసుకునేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినప్పటికీ.. కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతుండటంతో పేరున్న చిత్రాల బృందాలేవీ అందుకు సాహసించడం లేదు. సీరియళ్ల షూటింగ్స్ చేశారు కానీ.. అందులో పాల్గొన్న వాళ్లు కరోనా బారిన పడటంతో అవి కూడా అతి కష్టం మీద నడుస్తున్నాయి.
పెద్ద హీరోలెవ్వరూ కూడా ఇప్పట్లో చిత్రీకరణకు వెళ్లేలా కనిపించడం లేదు. తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కొత్త చిత్రం అన్నాత్తె చిత్రీకరణ చివరి దశలో ఉండటంతో అక్టోబర్లో షూటింగ్ పునఃప్రారంభించి నెల రోజుల్లో పని పూర్తి చేయాలని, పరిస్థితులు చక్కబడితే ముందు చెప్పినట్లే సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తమిళనాట కరోనా విజృంభణ మామూలుగా లేదు.
రజనీకాంత్‌కు అసలే ఆరోగ్య సమస్యలున్నాయి. ఆయన లాంటి వాళ్లు కరోనా బారిన పడితే చాలా ఇబ్బంది పడాల్సి రావచ్చు. అందుకే కుటుంబ సభ్యులు ఇప్పట్లో షూటింగ్‌కి ఆయన్ని పంపించే అవకాశమే లేదని తేల్చేశారు. రజనీ కూడా చిత్ర నిర్మాతలకు ఈ విషయంలో సమాచారం ఇచ్చేశారట. ఆరు నెలల పాటు తాను షూటింగ్‌కు రాలేనని చెప్పేశారట. ఐతే వచ్చే ఏడాది వేసవిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో అన్నాత్తె సినిమాను ఎలా పూర్తి చేసి ఎన్నికల మీద దృష్టిపెడతాడో చూడాలి సూపర్ స్టార్.
Gulte Telugu Telugu Political and Movie News Updates