సినీ పరిశ్రమలో కథలు చేతులు మారడం కొత్తేమీ కాదు. ఎవరో చేయాల్సిన కథను ఇంకెవరో చేయడం తరచుగా జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని కథను మిస్సయినందుకు కొందరు హీరో రిగ్రెట్ ఫీలవుతారు. కొన్ని సందర్భాల్లో హమ్మయ్య అనుకుంటారు. ఐతే కొన్ని కథలు మంచి ఫలితాన్నిచ్చినా కూడా వాటిని వదులుకున్న హీరోలు ఫీలవ్వరు. ఆ కథల్ని మనం చేస్తే బాగుండేది కాదు అనే ఫీలింగ్ కలుగుతుంది.
ఇలాంటి ఉదాహరణే ఇప్పుడు ఒకటి చూద్దాం. శేఖర్ కమ్ముల కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘ఫిదా’ సినిమాను ఆయన మహేష్ బాబుతో చేద్దామని అనుకున్నారట. ఆయన్ని దృష్టిలో ఉంచుకునే కథ రాశారట. అంతే కాదు.. మహేష్ బాబుకు ఆ కథను చెప్పగా ఆయనకు నచ్చి సినిమా చేస్తానని కూడా చెప్పారట. కానీ తీరా సినిమా మొదలుపెడదాం అనుకునే సమయానికి మహేష్ డేట్లు ఖాళీ లేవట.
ఈ విషయాన్ని స్వయంగా శేఖర్ కమ్ములనే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. మహేష్ బాబు హీరోగా, బాలీవుడ్ భామ దీపికా పదుకొనే కథానాయికగా ఈ చిత్రం చేయాలనుకున్నట్లు శేఖర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. కానీ హీరోల డేట్లు వాళ్ల చేతుల్లో కూడా ఉండవని.. ఈ సమస్యతోనే కథ నచ్చినా సినిమా చేయలేకపోతున్నట్లు మహేష్ చెప్పడంతో వరుణ్‌ను ఎంచుకున్నానని.. కథానాయికను కూడా మార్చేశానని శేఖర్ తెలిపాడు.
కానీ నిజంగా మహేష్ ఈ సినిమా చేసి ఉంటే ఎలా ఉండేది అనే ఊహలోకి వెళ్తే.. ఈ సబ్జెక్ట్ అతడికి కరెక్ట్ కాదు అనే అభిప్రాయం కలుగుతుంది. మహేష్ లాంటి సూపర్ స్టార్ ఇమేజ్‌కు ఈ కథ సూటయ్యేది కాదేమో. హీరోయిన్ పాత్ర చాలా డామినేట్ చేసే సినిమాలో మహేష్‌ను చూసి అభిమానులు తట్టుకోలేకపోయేవారేమో. యాక్షన్‌కు స్కోప్ లేని ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి క్లాస్ సినిమాలతో మహేష్ మెప్పించినప్పటికీ.. ‘ఫిదా’ అయితే అతడికి సూటయ్యేది కాదన్నది స్పష్టం.