ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవితో మరపురాని సినిమాలు తీసి క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్ పేరు మార్మోగేలా చేసిన నిర్మాత కేఎస్ రామారావు. ఛాలెంజ్, అభిలాష, రాక్షసుడు, మరణమృదంగం, స్టువర్టుపురం పోలీస్ స్టేషన్.. ఇవీ చిరుతో రామారావు తీసిన చిత్రాలు. ఇందులో చివరి చిత్రం తప్ప అన్నీ సూపర్ హిట్లయ్యాయి. చిరంజీవికి చాలామంచి పేరు కూడా తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత వెంకీతో స్వర్ణకమలం, చంటి లాంటి మైల్ స్టోన్ మూవీస్ తీశారు రామారావు.
ఐతే గత రెండు దశాబ్దాల్లో రామారావు జోరు బాగా తగ్గిపోయింది. నిర్మాతగా చేసిన కొన్ని సినిమాలు నిరాశపరిచాయి. ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డ ఆయనకు రామ్ చరణ్‌తో ఓ సినిమా చేయించాలని చిరు అనుకున్నారు. ఒక వేదిక మీద ఈమేరకు కమిట్మెంట్ కూడా ఇచ్చారు. ఐతే చరణ్‌తో వెంటనే కుదరకపోయేసరికి తనే ఆయనకు ఓ సినిమా ఇప్పించారు చిరు.
మెహర్ రమేష్ దర్శకత్వంలో మొదలైన భోళా శంకర్‌లో అనిల్ సుంకరతో పాటు రామారావును కూడా నిర్మాతగా చేర్చారు చిరు. ఈ సినిమాను ప్రకటించినపుడు.. ఆ తర్వాత షూటింగ్ మొదలయ్యాక రామారావు ఇందులో భాగస్వామిగానే ఉన్నారు. ఏప్రిల్లో ఒక పోస్టర్ రిలీజ్ చేసినపుడు కూడా క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్ పేరు అందులో ఉంది. కానీ తర్వాత ఉన్నట్లుండి ఆ బేనర్ పేరు ప్రోమోల నుంచి ఎగిరిపోయింది.
ఇప్పుడు నిర్మాతగా రామబ్రహ్మం సుంకర పేరే కనిపిస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సోలోగా ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు కనిపిస్తోంది. మరి మధ్యలో రామారావు ఎందుకు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారన్నది అర్థం కాని విషయం. అనిల్ ఈ మధ్యే ఏజెంట్ మూవీతో గట్టి ఎదురు దెబ్బ తిన్నాడు. ఆ ఎఫెక్ట్ ఏమైనా సినిమా మీద పడి రామారావు తప్పుకోవాల్సి వచ్చిందా… ఇంకేవైనా సమస్యలున్నాయా తెలియదు కానీ.. చిరు సినిమా నుంచి ఆయన ఫేవరెట్ ప్రొడ్యూసర్ వైదొలగడం మాత్రం ఆశ్చర్యకరమే.