క్రేజీ రీమేక్ లో స్టార్ వారసులు

గత ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి తమిళంలో బ్లాక్ బస్టర్ కావడంతో పాటు తెలుగులోనూ మంచి సక్సెస్ అందుకున్న లవ్ టుడే ఇతర భాషల్లో రీమేక్ కానుంది. ముఖ్యంగా బాలీవుడ్ వెర్షన్ కి క్రేజీ కాంబినేషన్ ని సెట్ చేయబోతున్నట్టు ముంబై టాక్. ముందు దీనికి వరుణ్ ధావన్ హీరోగా చేద్దామనుకున్నారు. కానీ కాల్ షీట్స్ సమస్య వల్లో ఇతర కారణాలో తెలియదు కానీ అతను దాన్నుంచి తప్పుకున్నాడు. కొత్త జంట అయితేనే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆర్టిస్టు సెలక్షన్ కోసం నెలల తరబడి ఎదురు చూశారు. చివరికది కొలిక్కి వచ్చినట్టు సమాచారం

అమీర్ ఖాన్ వారసుడు జునైద్ ఖాన్, అతిలోకసుందరి రెండో కూతురు ఖుషి కపూర్ లను లీడ్ పెయిర్ గా దాదాపు లాక్ చేశారట. ఆ మేరకు తల్లితండ్రుల అంగీకారం దక్కడంతో త్వరలోనే అఫీషియల్ లాంచ్ చేయబోతున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. అయితే వీళ్లిద్దరికీ ఇది డెబ్యూ మూవీ కాకపోవచ్చు. ఎందుకంటే జునైద్ ఆల్రెడీ యష్ రాజ్ సంస్థ నిర్మిస్తున్న థ్రిల్లర్ మూవీ మహారాజాలో ఎంట్రీ ఇచ్చేశాడు. మరోవైపు ఖుషి కపూర్ నెట్ ఫ్లిక్స్ నిర్మాణంలో ఉన్న వెబ్ సిరీస్ ది ఆర్చీస్ షూటింగ్ లో పాల్గొంటోంది. ఈ రెండు లవ్ టుడే కన్నా ముందే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి

దర్శకుడు ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రదీప్ రంగనాధన్ నే అడిగారు కానీ ఇతర కమిట్ మెంట్స్ వల్ల అతను చేయడం అనుమానమే. సింపుల్ స్టోరీ లైన్ తో ఏడు కోట్ల బడ్జెట్ తో రూపొంది తొంబై కోట్ల దాకా వసూలు చేసిన లవ్ టుడేని నార్త్ ఆడియన్స్ అభిరుచులకు తగ్గట్టు కొన్ని కీలక మార్పులు చేయిస్తున్నారట. కథను పూర్తిగా మార్చకుండా కేవలం సౌత్ ఫ్లేవర్ ఉన్న అంశాలకు మాత్రం రీ టచ్ ఇస్తున్నారు. హిందీలో గత కొన్ని నెలలుగా దృశ్యం 2 లాంటి ఒకటి రెండు తప్ప దాదాపు రీమేకులన్నీ అడ్డంగా బోల్తా కొట్టాయి. మరి లవ్ టుడే ఏం చేస్తుందో