నిన్న ఫ్యామిలీ మ్యాన్ ఇప్పుడు బందా

రామ్ గోపాల్ వర్మ సత్యతో పరిచయమై డెబ్యూతోనే నటుడిగా ప్రూవ్ చేసుకున్న మనోజ్ బాజ్ పాయ్ కి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అల్లు అర్జున్ హ్యాపీలో సిల్లీగా మోసపోయే పోలీస్ ఆఫీసర్ గా తన పెర్ఫార్మన్స్ ని మర్చిపోలేం. ప్రేమకథ, కొమరం పులి లాంటి చిత్రాలలో అడపాదడపా కనిపించిన మనోజ్ పూర్తిగా బాలీవుడ్ కే అంకితమయ్యాడు. ది ఫ్యామిలీ మ్యాన్ రూపంలో బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ పడ్డాక వెనుదిరిగి చూడాల్సిన అవసరం పడలేదు. తాజాగా ఇతనో డైరెక్ట్ ఓటిటి మూవీ ద్వారా మరోసారి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. అదే సిర్ఫ్ ఏక్ బందా కాఫీ.

దీనర్థం ఒక సామాన్యుడు చాలు. మైనర్ వయసున్న నూ(అద్రిజా)తాను నమ్మే ఒక బాబా(సూర్య మోహన్) ఆశ్రమానికి వెళ్ళినప్పడు అతను అత్యాచారం చేయబోతాడు. తప్పించుకుని వచ్చిన నూ కేసు పెడుతుంది. ఆ అమ్మాయి తరఫున వాదించేందుకు సోలంకి(మనోజ్ బాజ్ పాయ్) ముందుకొస్తాడు. అయితే డబ్బు పలుకుబడి ఉన్న బాబా దెబ్బకు నలుగురు సాక్షులు హత్యకు గురవుతారు. అపోజిషన్ లాయర్లు మారతారు. అయినా సరే సోలంకి, నూలు భయపడకుండా బాబాకు శిక్షపడే దాకా పోరాడతారు. 2013లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆసారామ్ బాపూ కేసు ఆధారంగా ఇది తీశారు

ఆద్యంతం మనోజ్ బాజ్ పాయ్ తన నటనతో అదరగొట్టేశాడు. దాదాపు ముప్పాతిక సినిమా కోర్టు రూమ్ లోనే జరిగినా ఎక్కువ విసుగు రాకుండా ఆసక్తికరంగా నడిపించడంలో దర్శకుడు అపూర్వ్ సింగ్ సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఇలాంటి వివాదాల్లో అమలు కావాల్సిన సెక్షన్లు, బాధితుల రక్షణకు రాసుకున్న చట్టాలు డిటైల్డ్ గా చూపించారు. ఆర్టిస్టులందరూ చక్కగా నటించడం సహజమైన ఫీల్ తీసుకొచ్చింది. అయితే ఇలాంటి బ్యాక్ డ్రాప్స్ పట్ల ఆసక్తి లేని వాళ్లకు కొంత బోర్ కొట్టొచ్చేమో కానీ మనోజ్ బాజ్ పాయ్ కోసం, మన న్యాయవ్యవస్థ పనితనం తెలుసుకునే ఆసక్తి ఉంటే మాత్రం సులభంగా మెప్పిస్తుంది