నరేష్ ఆస్తి వెయ్యి కోట్లకు పైనేనట..

Naresh

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ ఆస్తి పాస్తుల గురించి తరచుగా చర్చ జరుగుతూ ఉంటుంది. 70వ దశకం నుంచి సినిమాల్లో చాలా బిజీగా ఉన్న నరేష్ సొంతంగానే పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించగా.. తల్లి విజయ నిర్మల నుంచి వచ్చిన ఆస్తులు కూడా కలిపితే అది వెయ్యి కోట్లకు తక్కువ ఉండదు అని ఇండస్ట్రీ జనాలు అంటుంటారు. ఐతే నరేష్ ఇప్పటిదాకా మీడియా ముందు కానీ.. ఇంటర్వ్యూల్లో కానీ తన ఆస్తుల గురించి పెద్దగా మాట్లాడింది లేదు.

కానీ తనే లీడ్ రోల్ చేసిన కొత్త చిత్రం ‘మళ్ళీ పెళ్ళి’ని గట్టిగా ప్రమోట్ చేస్తున్న నరేష్.. ఇందులో భాగంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్థిక విషయాల గురించి ఓపెన్ అయ్యాడు. తన ఆస్తి వెయ్యి కోట్లు, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చన్న ప్రచారంపై ఆయన స్పందించారు. ఇవి ఊహాగానాలు కాదని.. నిజమే అని క్లారిటీ ఇవ్వడం విశేషం.

“నేను రిచ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అవును.. నేను బిలియనీర్‌ని అని ఒప్పుకుంటా. మా అమ్మగారి నుంచి నాకు ఆస్తులు వచ్చాయి. నేను కూడా కష్టపడి చాలానే సంపాదించా. మేం భూముల మీద పెట్టుబడులు పెట్టాం. వాటి ధరలు బాగా పెరిగాయి. మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఐతే ఎంత డబ్బు ఉంది అన్నదాన్ని బట్టి మనం ఎంత ధనవంతులం అనేది ఆధారపడి ఉండదు. ఎంత సంతోషంగా ఉన్నాం అన్నదే ముఖ్యం. రోజూ ఎంత ఆనందంగా గడుపుతాం. ఉన్న డబ్బును ఎలా ఖర్చు పెడతాం అన్నది చూడాలి. మేం మా కోసమే కాక అవసరంలో ఉన్న వారి కోసం కూడా డబ్బులు ఖర్చు పెడతాం. మాకు వీలైనంత మేర పది మందికి సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. నేను చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నా. ఆస్వాదిస్తున్నా. అది అన్నింటికంటే ముఖ్యమైన విషయం” అని నరేష్ తెలిపాడు.