స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఎట్టకేలకు ముగిశాయి. విజయవాడ, హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్లు సక్సెస్ అయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడం లాంటి వెలితి ఉన్నప్పటికీ రామ్ చరణ్, వెంకటేష్, నాగ చైతన్య లాంటి స్టార్లు రావడంతో ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. అయితే పరిశ్రమ వైపు ప్రత్యేకంగా ఏదైనా వేడుక జరిగే ఉంటే బాగుండేదన్న అసంతృప్తి అభిమానుల్లో లేకపోలేదు. తెనాలిలోని పెమ్మసాని థియేటర్లో ఎన్టీఆర్ నటించిన మూడు వందలకు పైగా సినిమాలను ఏడాదిపాటు ఏకధాటిగా మార్నింగ్ షోలు ఉచితంగా వేయడం ఒక రికార్డనే చెప్పాలి.
వచ్చే ఏడాది అక్కినేని వంతు రాబోతోంది. 2024తో ఏఎన్ఆర్ జయంతి వంద సంవత్సరాల మైలురాయి చేరుకుంటుంది. దీన్ని ఎలా చేస్తారోనని మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి నాగార్జున దగ్గర ప్రత్యేకమైన ప్లాన్లు ఉన్నాయట. ఆరు నెలల ముందు నుంచే ఫిలిం ఫెస్టివల్, ఫోటో ఎగ్జిబిషన్, ఫ్యాన్ క్లబ్ మీటింగ్స్ లాంటివి ఏర్పాటు చేయడంతో పాటు ఆ మధ్య అమితాబ్ బచ్చన్ సినిమాలను పివిఆర్ మల్టీప్లెక్సుల్లో ప్రదర్శించినట్టు ఏఎన్ఆర్ బ్లాక్ బస్టర్స్ ని బిగ్ స్క్రీన్ పై రిలీజ్ చేసే ప్రణాళిక సిద్ధం చేయబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్.
దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇవి అరుదైన సందర్భాలు. శత వసంతాలు అనేది ఏ స్టార్ హీరోకైనా అరుదైన ఘట్టం. ప్రత్యక్షంగా చూసే అదృష్టం ఉన్నా లేకపోయినా వారసులు ఆ బాధ్యతలు తీసుకోవాలి. బాలయ్య అందుకే ఎన్టీఆర్ సెనెటరీ సెలబ్రేషన్స్ ని అంతా తానై చూసుకున్నారు. ఏఎన్ఆర్ మూడు తరాలు నాగ్, చైతు, అఖిల్ ముగ్గురూ ఇండస్ట్రీలో సెటిలైపోయిన టైంలో రాబోతున్న హండ్రెడ్ ఇయర్స్ ఫంక్షన్ కాబట్టి చాలా స్పెషల్ గా ఉండాలి. అసలే హిట్లు లేవని ఫ్యాన్స్ బాధ పడుతున్న టైంలో ఇలాంటివి చాలా అవసరం.