టాక్ తో సంబంధం లేకుండా రెవిన్యూ విషయంలో బిచ్చగాడు 2 ఒకటే పైచేయి సాధించింది. అన్నీ మంచి శకునములే ఆదివారం పర్వాలేదనిపించుకోగా సోమవారం డ్రాప్ మాత్రం ఆందోళనకరంగా కనిపిస్తోంది. ఇక ఇప్పుడు అందరి చూపు మే 26 మీదకు వెళ్తోంది. వస్తున్నవన్నీ చిన్న సినిమాలే. ఎందులోనూ భారీ క్యాస్టింగ్ లేదు. కానీ ప్రమోషన్లు మాత్రం ఆకట్టుకునేలా చేస్తూ మీడియాతో పాటు ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. ఓపెనింగ్స్ విషయంలో గ్యారెంటీ లేకపోయినా కనీసం మొదటి రోజు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడియన్స్ ని రప్పించేందుకు కష్టపడుతున్నాయి.
మొదటగా ‘మేం ఫేమస్’ దిగుతోంది. ఛాయ్ బిస్కెట్ బృందం సెలబ్రిటీలను తీసుకొచ్చి చేయిస్తున్న షాట్స్ ట్విట్టర్ లో బాగా వెళ్తున్నాయి. సుమంత్ ప్రభాస్ హీరోగా దర్శకుడిగా లాంచ్ అవుతున్నాడు. ముగ్గురు జులాయి కుర్రాళ్ల కథ కనక యూత్ కి కనెక్ట్ అయితే హిట్టు గ్యారెంటీ. నరేష్ పవిత్ర లోకేష్ ల ‘మళ్ళీ పెళ్లి’కి పబ్లిసిటీ హడావిడి మాములుగా లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇద్దరూ ఆడిపాడిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది . ఏంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ వెరైటీ బయోపిక్ మాస్ ని లాగేలానే ఉంది. టాక్ యావరేజ్ వచ్చినా సులభంగా గట్టెక్కిపోతుంది.
మైత్రి మూవీ మేకర్స్ పంపిణి చేస్తున్న ‘మెన్ టూ’ అదే రోజు వస్తోంది. అమ్మాయిలు భార్యల వల్ల బాధితులైన అబ్బాయిల కథగా పూర్తి ఎంటర్ టైన్మెంట్ యాంగిల్ లో రాసుకున్నారు. ఎఫ్2, సేవ్ ది టైగర్స్ షేడ్స్ కన్పిస్తున్నాయి. మలయాళం బ్లాక్ బస్టర్ ‘2018’ ని బన్నీ వాస్ సహాయంతో ఆయన మిత్రులు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇవి కాకుండా గెలుపు గీత దాటితే, గోవిందా భజ గోవిందా, హీరో అఫ్ ఇండియా వస్తున్నాయి. వీటిలో ఏవి డ్రాప్ అవుతాయో చెప్పలేం. మొత్తానికి డ్రైగా సాగుతున్న మే నెలని ఎవరు సక్సెస్ తో ముగిస్తారో ఈ శుక్రవారం ఉదయం తేలిపోతుంది.