రిస్క్ చేయడం వద్దనుకున్న ఆదిపురుష్

జూన్ 16 విడుదల తేదీకి మూడు రోజుల ముందే ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్ లో ఆది పురుష్ ప్రీమియర్లు వేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రోత్సవంలో ప్రదర్శించబోయే అన్ని సినిమాలకంటే దీనికే టికెట్లు చాలా ముందస్తుగా సోల్డ్ అవుట్ కావడం సంచలనం రేపింది. అయితే వీటిని రద్దు చేసినట్టుగా వచ్చిన వార్త ఫ్యాన్స్ లో కలకలం రేపుతోంది. అంతేకాదు సాధారణంగా భారతీయ కాలమాన ప్రకారం చాలా ముందుగానే వేసే యుఎస్ షోలను క్యాన్సిల్ చేసే దిశగా నిర్మాతలు ఆలోచిస్తున్నట్టు లేటెస్ట్ అప్డేట్. ఇంకా వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాలి

ఒకరకంగా ఇది మంచి చేసేదే. ఎందుకంటే ఈ ఎర్లీ షోల వల్ల టాక్ డివైడ్ గా రావడం, యుఎస్ రివ్యూలు అటుఇటు కావడం ఈ మధ్య సర్వసాధారణం అయిపోయింది. పైగా విజువల్ ఎఫెక్ట్స్ మీద ఇప్పటికే విమర్శలు ఉన్న నేపథ్యంలో ఫుల్ కంటెంట్ చూశాక ఏదైనా తేడా రిపోర్ట్స్ వచ్చాయంటే దాని ప్రభావం నేరుగా ఇక్కడి బాక్సాఫీస్ మీద పడుతుంది. నిజానికి ట్రైలర్ చూశాక ఆడియన్స్ లో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. తక్కువ టైంలో వంద మిలియన్ల వ్యూస్ దాటేశాయి. ఇప్పుడు నమ్మకం కుదిరిందని మూవీ లవర్స్ అభిప్రాయపడ్డారు. నెగటివిటీ తగ్గిన మాట వాస్తవం

అయినా కూడా ఈ నిర్ణయం తీసుకుంటే సాహసమే. జూన్ 15 తెలుగు రాష్ట్రాలతో పాటు ముంబై లాంటి ప్రధాన నగరాల్లో స్పెషల్ షోలు వేసే ప్రతిపాదనని టి సిరీస్ ఇంకా పరిశీలనలో ఉంచింది. ధార్మిక సంస్థలకు, ఆలయాల ఉద్యోగులకు, ప్రభుత్వ ప్రతినిధులు మంత్రులకు స్క్రీనింగ్ చేసే ఆలోచనలు జరుగుతున్నాయి. మొత్తానికి ఆది పురుష్ సినిమాకు సంబంధించి పోస్ట్ రిలీజ్ సమాచారం ఏదైనా సరే అందరికీ ఒకేసారి తెలిసేలా ఉంది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ రామాయణ గాథలో కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు