టాలీవుడ్‌కు తమిళ దర్శకుల షాక్‌లు

తమిళ దర్శకుల మీద తెలుగు హీరోల ఆసక్తి ఈనాటిది కాదు. కానీ ఒక దశలో అది ఆసక్తిని దాటి మోజుగా మారింది. మధ్యలో కొన్నేళ్లు తమిళ దర్శకులకు తెలుగు హీరోలు దూరంగా ఉన్నారు కానీ.. కొన్నేళ్ల నుంచి మళ్లీ వారి వైపు చూస్తున్నారు. కానీ ఎన్నో ఆశలు, అంచనాలతో వారితో సినిమాలు చేస్తున్న తెలుగు స్టార్లకు షాకులు తప్పట్లేదు.

కొన్నేళ్ల కిందట సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడైన మురుగదాస్‌లో మహేష్ బాబు జట్టు కట్టాడు. మురుగదాస్ మంచి ఫాంలో ఉండగా మహేష్ ‘స్పైడర్’ చేశాడు. కానీ మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ డెలివర్ చేసిన మురుగదాస్.. ఆ తర్వాత కోలుకోలేకపోయాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి మూవీతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న అనంతరం తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్‌తో ‘నోటా’ సినిమా చేశాడు. అది అతడి కెరీర్లో అతి పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది.

ఇక గత ఏడాది మరో యువ కథానాయకుడు రామ్.. తమిళ సీనియర్ దర్శకుడు లింగుస్వామితో ‘ది వారియర్’ చేశాడు. లింగుస్వామి ఫామ్ కోల్పోయి చాలా కాలం అయినా రామ్ రిస్క్ చేశాడు. ఫలితంగా ఒక డిజాస్టర్ తన ఖాతాలో పడింది. ఇప్పుడు వెంకట్ ప్రభు లాంటి విలక్షణ దర్శకుడు కూడా తెలుగు స్టార్‌కు హిట్ ఇవ్వలేకపోయాడు.

తన కథకు సరిపోతాడని ఏరి కోరి నాగచైతన్యను ఎంచుకుని ఆయన తెలుగు, తమిళ భాషల్లో ‘కస్టడీ’ మూవీ తీశాడు. అసలే చైతూ సరైన ఫాంలో లేడు. మంచి హిట్ కొట్టి చాలా కాలం అయింది. అక్కినేని వారికి అస్సలు కలిసి రాని టైంలో ‘కస్టడీ’ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. ఈ చిత్రం కూడా అంచనాలను అందుకోలేకపోయింది. నెగెటివ్ టాక్‌తో మొదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం నిలబడుతుందో అనే సందేహాలు కలుగుతున్నాయి.