పవన్ సినిమాపై పూనమ్ పంచ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను తరచుగా ఏదో రకంగా టార్గెట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది పూనమ్ కౌర్. వీరి మధ్య బంధం గురించి ఎన్నో ఏళ్ల నుంచి రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకునే పూనమ్ ఎప్పుడు ఏం మాట్లాడినా అందరూ ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తుంటారు. చాలాసార్లు ఇన్ డైరెక్ట్‌గా పవన్ మీద ఎటాక్ చేసింది పూనమ్.

తాజాగా ఆమె పవన్ కొత్త సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ టీజర్ రిలీజ్ కాబోతున్న విషయాన్ని వెల్లడిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ విషయంలో ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పోస్టర్లో పవన్ కాళ్లను మాత్రమే చూపించారు. పోస్టర్ చూస్తే ఆయన షూ కింద ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే టైటిల్ కనిపిస్తుంది. ఇదే పూనమ్‌కు అభ్యంతరకరంగా మారింది.

“మీరు విప్లవకారులను గౌరవించకపోయినా పర్వాలేదు. కానీ అవమానించకండి. ఈ మధ్య రిలీజైన ఒక సినిమా పోస్టర్లో భగత్ సింగ్ అనే పేరు కాలి కింద ఉంది. ఇది అహంకారమా.. అజ్ఞానమా?” అని పూనమ్ ప్రశ్నించింది. ఐతే సినిమా పోస్టర్‌ను ఈ దృష్టితో చూడటం ఏం న్యాయం.. ఇలా చూస్తే ప్రతిదీ తప్పుగానే అనిపిస్తుంది అని నెటిజన్లు పూనమ్‌కు కౌంటర్లు ఇస్తున్నారు. పవన్‌ను అనాలన్న ఉద్దేశంతోనే ఆమె ఈ పోస్టర్‌ను సాకుగా ఉపయోగించుకుంటోందంటూ కొందరు పవన్ ఫ్యాన్స్‌ ఆమెను తిట్టిపోస్తున్నారు.

ఐతే ఇలాంటి విషయాలను చిత్ర బృందం పట్టించుకునే స్థితిలో లేదన్నది వాస్తవం. పవన్, హరీష్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సరిగ్గా మే 11నే రిలీజైంది. ఆ సినిమా 11వ వార్షికోత్సవం పూర్తి చేసుకుంటున్న సమయంలోనే పవన్, హరీష్ కలయికలో తెరకెక్కిన కొత్త చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీజర్‌ను లాంచ్ చేస్తున్నారు.