లేటు వయసు పెళ్లికి ఆర్టిస్టుల పోరాటం

టాలీవుడ్డే కాదు ప్రపంచంలో ఏ భాష సినిమా పరిశ్రమలో అయినా బ్రేకప్ లు రెండు మూడో పెళ్లిళ్ల సెలబ్రిటీల కథలు కోకొల్లలు. కానీ అవన్నీ నాలుగు గోడలకు లేదా మహా అయితే మీడియా రాతలకే పరిమితం తప్ప ఏనాడూ డైరెక్ట్ గా తెరమీదకొచ్చే సాహసం చేయలేదు. కానీ అయిదు దశాబ్దాల సుదీర్ఘ అనుభవమున్న సీనియర్ హీరో కం నటులు నరేష్ ఒక కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టబోతున్నారు. మళ్ళీ పెళ్లి టైటిల్  తో తన నాలుగో మ్యారేజ్ ని బయోపిక్ రూపంలో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా ట్రైలర్ వచ్చేసింది. మొత్తం అరటిపండు వలిచినట్టు నరేష్ రియల్ లైఫ్ నే ఇందులో చూపించారు. వయసయ్యాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెలుగుతున్న నటుడి(నరేష్)కి షూటింగ్ స్పాట్ లో పార్వతి(పవిత్ర లోకేష్)తో ఏర్పడిన పరిచయం ఆకర్షణతో మొదలై ప్రేమగా మారి సహజీవనం దాకా వెళ్తుంది. పార్వతికి భర్త ఉన్నా ఇంట్లో సుఖం, మనఃశాంతి రెండూ ఉండవు. ఇటు మన హీరోది స్టార్ ఫ్యామిలీ. అడ్డంకులు ఎన్ని వచ్చినా ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకుంటాడు. ఈ క్రమంలో ఎదురయ్యే మలుపులు దెబ్బలు అవమానాలు రక్తపాతం వగైరాలే ఈ మళ్ళీ పెళ్లి కథ

డైలాగులు చాలా బోల్డ్ గా ఉన్నాయి. నరేష్ వయసు గురించి, పవిత్ర లోకేష్ మాజీ భర్తతో చెప్పే సుఖం సంభాషణలు ఎక్కడా మొహమాటం లేకుండా సాగాయి. డర్టీ హరీ మేకింగ్ స్టైల్ ని ఎంఎస్ రాజు ఇందులోనూ తీసుకొచ్చారు. నరేష్ భార్యతో ఉన్న గొడవ, ఇంట్లో వాళ్ళు ఆ విషయంలో వ్యవహరించిన తీరు ఓపెన్ గా చూపించారు. పనిలో పనిగా ఈ బంధానికి సూపర్ స్టార్ కృష్ణగారి అనుమతి ఉందనేలా ఒక షాట్ లో ఆ క్యారెక్టర్ ని చూపించడం మరో ట్విస్టు. మొత్తానికి గుట్టుచప్పుడు కాకుండా షూటింగ్ చేసుకున్న మళ్ళీపెళ్లి మే 26న థియేటర్లలో పెద్ద సందడే చేసేలా ఉంది