డబ్బులే సంపాదించాలంటే వేరే వ్యాపార మార్గాలు చాలా ఉంటాయి. వాటితో పోలిస్తే సినిమా రంగం చాలా రిస్క్‌తో కూడుకున్నది. ఇక్కడ సక్సెస్ రేట్ చాలా తక్కువ అని తెలిసినా.. ఈ రంగం పట్ల ఉన్న మోజు కావచ్చు, తపన కావచ్చు.. చాలామందిని ఇటు వైపు నడిపిస్తాయి. వేరే వ్యాపారాల్లో విజయవంతంగా కొనసాగుతున్న వాళ్లు కూడా సినిమాల్లో అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తారు. అనిల్ సుంకర కూడా అలా టాలీవుడ్లోకి అడుగు పెట్టిన వాడే.
యుఎస్‌లో విజయవంతంగా వ్యాపారాలు నడిపిస్తున్న ఆయన.. ముందుగా డిస్ట్రిబ్యూషన్లోకి అడుగు పెట్టి, ఆ తర్వాత 14 రీల్స్ అధినేతలతో కలిసి సినిమాలు నిర్మించాడు. నమో వెంకటేశాయ, 1 నేనొక్కడినే, దూకుడు, ఆగడు లాంటి భారీ చిత్రాల్లో ఆయన భాగస్వామి. ఇలా ఓవైపు భారీ చిత్రాలు నిర్మిస్తూనే.. మరోవైపు ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనే సొంత బేనర్ పెట్టి చిన్న చిత్రాలు ప్రొడ్యూస్ చేస్తూ వచ్చాడాయన. తర్వాత 14 రీల్స్ నుంచి విడిపోయి తన బేనర్లోనే పూర్తి స్థాయిలో సినిమాలు చేస్తున్నాడు.
ఐతే ఇప్పటిదాకా నిర్మాతగా అనిల్‌కు విజయాలున్నాయి, ఫ్లాపులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆయనకు తగిలిన దెబ్బ అలాంటిలాంటిది కాదు. హీరోగా సరైన ట్రాక్ రికార్డు లేని, స్టార్ ఇమేజ్ తెచ్చుకోని అక్కినేని అఖిల్ మీద ఆయన ఏకంగా రూ.80 కోట్లు పెట్టి ఏజెంట్ సినిమా తీశాడు. ముందు ఈ సినిమా బడ్జెట్ రూ.50 కోట్లన్నారు. అదే చాలా ఎక్కువ అనుకుంటే… రకరకాల కారణాల వల్ల సినిమా బాగా ఆలస్యం కావడం వల్ల బడ్జెట్ రూ.80 కోట్లకు పెరిగిపోయింది. అంత రిస్క్ చేస్తే చివరికి అనుకున్న స్థాయిలో బిజినెస్ అవ్వలేదు. డెఫిషిట్‌తోనే సినిమాను రిలీజ్ చేశారు. విడుదల తర్వాత పరిస్థితి మెరుగు పడుతుందనుకుంటే.. కథ రివర్సయింది. తక్కువ రేట్లకు అమ్మకాలు జరిపినా అది కూడా రికవర్ అయ్యేలా లేదు.
సొంతంగా రిలీజ్ చేసుకున్న చోట్ల పెద్దగా ఆదాయం వచ్చేలా లేదు. నాన్ థియేట్రికల్ ద్వారా వచ్చిన ఆదాయం కలుపుకున్నా.. అనిల్‌కు భారీ నష్టం తప్పేలా లేదు. ఇన్నేళ్లలో ఏ సినిమా కొట్టని దెబ్బ ఏజెంట్ కొట్టేలా ఉంది ఆయన్ని. ప్యాషన్‌తో సినిమాలు ప్రొడ్యూస్ చేసే నిర్మాతకు ఇలా జరగడం బాధాకరం.