విభిన్నమైన కథలను ఎంచుకుంటూ హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా ఇమేజ్ కి కట్టుబడని హీరో శ్రీవిష్ణు. రాజరాజ చోర బాగా ఆడినా ఆ తర్వాత వచ్చిన అర్జునా ఫల్గునా, భళా తందనానలు డిజాస్టర్ కావడంతో ఈసారి మరింత జాగ్రత్తగా చేసిన సినిమా సామజవరగమన. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ వచ్చే నెల మే 18న విడుదల కాబోతోంది. చూచాయగా లైన్ ఏంటో వివరిస్తూ కట్ చేసిన టీజర్ ఇందాకా రిలీజ్ చేశారు. శ్రీవిష్ణు ఈసారి కూడా ఎక్కువ కామెడీనే నమ్ముకుని ఓ వెరైటీ ప్రేమకథతో పలకరించబోతున్నాడు. చిన్న వీడియోలో గుట్టు చెప్పేశారు
బాలు ఉరఫ్ బాలసుబ్రమణ్యం ఏషియన్ మల్టీప్లెక్సులో టికెట్ కౌంటర్ ఉద్యోగి. టీనేజ్ కొచ్చాక బాగా మనసుపడిన అమ్మాయి చివరికి హ్యాండ్ ఇచ్చి రాఖీ కట్టడంతో అప్పటి నుంచి విరక్తి పుట్టి పరిచయమైన ప్రతి లేడీ నుంచి కట్టించుకోవడం అలవాటుగా మార్చుకుంటాడు. ఇదో ప్రహసనంగా మారిపోయి చేతికి వందల రాఖీలు వచ్చి పడతాయి. ఆఖరికి ఇతనంటే ఇష్టపడే ఓ బ్యూటీ(రెబ్బ మోనికా జాన్)ని సైతం రక్షాబంధన్ అడుగుతాడు. ఇంతకీ కుర్రాడు ఇంత వైరాగ్యంలోకి ఎందుకు వెళ్ళాడు, పైకి నవ్వుతున్నా అతని వెనుక ఉన్న ట్విస్టు ఏంటో తెలియాలంటే సామజవరగమన చూడాలి.
కాన్సెప్ట్ కొత్తగానే ఉంది. పూర్తి ఫన్ ని బేస్ చేసుకుని రామ్ అబ్బరాజు తెరకెక్కించారు. కొంత గ్యాప్ తర్వాత శ్రీవిష్ణు మళ్ళీ తనలో కామెడీ టైమింగ్ ని బయటికి తీశాడు. భాను భోగవరపు కథ, నందు సంభాషణలు అందించిన సామజవరగమనకు రామ్ రెడ్డి ఛాయాగ్రహణం సమకూర్చారు. బడ్జెట్ లో తీసిన చిత్రమే అయినప్పటికీ యూత్ ని ఆకట్టుకునే అంశాలు బాగానే దట్టించారు. చక్కని హాస్యం ఉంటే ఆడియన్స్ ఆదరిస్తారని జాతిరత్నాలు లాంటివి నిరూపించాయి. ఎంటర్ టైన్మెంట్ కి కాస్త ఎమోషనల్ టచ్ ప్లస్ లవ్ ఉంటే చాలు సామజవరగమన సులభంగా పాసైపోతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates