అల్లు అర్జున్ హీరోగా నటించిన సంచలన మూవీ.. పుష్ప
నిర్మాతలు, దర్శకుడి ఇళ్లు, ఆఫీసులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని నిర్మాత, దర్శకుల ఇళ్లు, కార్యాలయాలకు వచ్చిన ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి.. దాడులు చేస్తున్నట్టు తెలిసింది. దాడుల విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచారు.
పుష్ప.. ది రైజ్ సినిమా గత ఏడాది బాక్సాఫీసులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ఎలాంటి అంచనా లు లేకుండానే తెరకెక్కిన ఈ సినిమా అనూహ్య విజయాన్ని నమోదు చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మాణ సారథ్యంలో నిర్మాతలు నవీన్ యేర్నేని, వై. రవి శంకర్, చేకూరి మోహన్ లు పుష్ప-1 మూవీని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను యువ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించారు.
175-200 కోట్ల రూపాయల వ్యయంతో తీసిన పుష్ప-1 కలెక్షన్లలో దూసుకుపోయింది. ఏకంగా.. 350 – 420 కోట్ల రూపాయలు రాబట్టినట్టు నిర్మాతలు ప్రకటించారు. ఇక, ఇటీవలే దీనికి సీక్వెల్ గా తీస్తున్న పుష్ప ది రూలర్(పుష్ప-2) ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఇది కూడా అంచనాలు మరింతగా పెంచేసింది. ఈ ఏడాదిలో ఈ మూవీ విడుదల కానుంది. ఇదిలావుంటే.. పుష్ప -2 ట్రైలర్ విడుదలైన వారంలోనే ఐటీ అధికారుల కన్ను ఈ మూవీ నిర్మాతలు, దర్శకుడిపై పడింది.
ఈ రోజు(బుధవారం) ఉదయం.. వారి కార్యాలయాలు, ఇళ్లపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రధానంగా విచారణ చేస్తున్నట్టు సమాచారం. ఆదాయ వ్యయాలను ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. అదేవిధంగా పుష్ప – 2 బడ్జెట్ ను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం పుష్ప నిర్మాతలు దర్శకుడి ఇంటిపై ఐటీ దాడుల వ్యవహారం సంచలనంగా మారింది.