ఇప్పుడు తెలుగులో తెలంగాణ ప్రాంత కథలతో, ఇక్కడి నేపథ్యంలో తెరకెక్కే సినిమాలు బాగా పెరిగాయి. ఈ మధ్యే వచ్చిన ‘బలగం’ పూర్తిగా తెలంగాణ మట్టి కథతో తెరకెక్కింది. ‘దసరా’ లాంటి కమర్షియల్ సినిమాకు కూడా తెలంగాణ నేపథ్యమే తీసుకున్నారు. దీంతో పాటు తెలంగాణ చరిత్రను తెలియజెప్పే కథలు కూడా రూపొందుతున్నాయి. ఈ క్రమంలోనే ‘రుద్రంగి’ అనే కొత్త సినిమా తెరపైకి వచ్చింది.
తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించిన సినిమా ఇది. అజయ్ సామ్రాట్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. కొంచెం పెద్ద బడ్జెట్లోనే పీరియడ్ ఫిలింగా ‘రుద్రంగి’ని రూపొందించారు. తాజాగా ఈ చిత్ర టీజర్ లాంచ్ చేశారు. ఇందులో అందరి దృష్టినీ ఆకర్షించింది జగపతిబాబు పోషించిన విలన్ పాత్రే. కెరీర్లో ఎన్నడూ చేయని ఒక వైవిధ్యమైన, వయొలెంట్ క్యారెక్టర్ జగపతిబాబు ఇందులో చేసినట్లున్నాడు.
భారత దేశానికి 1947లో స్వాతంత్రం వచ్చినా.. కొన్నేళ్ల పాటు తెలంగాణలోని కొన్ని సంస్థానాలు దొరల పాలనలోనే ఉన్న సమయంలో నడిచే కథ ఇది. స్వాతంత్ర్యం బానిసలకు ఉండదు అంటూ.. తన దగ్గర పని చేసే వారిని తీవ్రంగా హింసించే దొర పాత్రలో జగపతిబాబు కనిపించారు. ఆయన పాత్ర చిత్రణ.. హావభావాలు చాలా చిత్రంగా అనిపిస్తున్నాయి. టీజర్ చూస్తుంటేనే జగపతిబాబు నటన భయపెట్టేస్తోంది. ఒక విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్‌తో క్రూరత్వాన్ని పండించే ప్రయత్నం చేశారాయన.
దొరకు ఎదురు తిరిగి.. బానిసత్వపు సంకెళ్లు తెంచడానికి ప్రయత్నించే విప్లవకారుడి పాత్రలో ఆశిష్ గాంధీ నటించాడు. మలయాళ నటి మమతా మోహన్ దాస్‌తో పాటు విమలా రామన్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఇన్నేళ్ల తర్వాత కూడా మమత చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఆమె పాత్రకు కథలో మంచి ఫ్రాధాన్యమే ఉన్నట్లుంది. ఈ చిత్రం మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates