ఏజెంట్ అభిమానుల డౌట్లు తీరినట్టే

సరిగ్గా ఇంకో 12 రోజుల్లో ఏజెంట్ ఆగమనం జరగబోతోంది. అక్కినేని అభిమానుల ఎదురు చూపులు మాములుగా లేవు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత భారీ గ్యాప్ వచ్చేయడంతో దీంతో బ్లాక్ బస్టర్ అందుకుని తద్వారా నెక్స్ట్ చేయబోయే సినిమాలకు ఎలాంటి కథలను ఎంపిక చేసుకోవాలనే ప్లాన్లో ఉన్నాడు అఖిల్. నిన్న ప్రత్యేకంగా ప్రెస్ తో జరిపిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీట్ లో చాలా సందేహాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఇంత జాప్యం జరగడానికి కారణం రెండు లాక్ డౌన్లతో పాటు దర్శకుడు సురేందర్ రెడ్డి ఆరు నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన విషయం బయటపడింది.

రెండేళ్ల పాటు ఒకే గెటప్ లో ఉంటూ ఏజెంట్ కోసం తన బెస్ట్ ఇచ్చిన అఖిల్ ని నిర్మాత అనిల్ సుంకర పొగడ్తలతో ముంచెత్తారు. ఒక స్టార్ రాబోతున్నాడని బాహుబలి తర్వాత ప్రభాస్ సత్తా ఎలా అయితే ప్యాన్ ఇండియా రేంజ్ కు పెరిగిందో ఇప్పుడు అఖిల్ విషయంలోనూ అదే జరుగుతుందని హామీ ఇచ్చారు. డైరెక్టర్ సూరి కమిట్ మెంట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. హీరోయిన్ సాక్షి వైద్య మీడియా కెమెరా ముందుకు మొదటిసారి వచ్చింది. మమ్ముట్టి మిస్ అయినా రాబోయే రోజుల్లో ఆయన్ని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు గట్రా చేయించేందుకు టీమ్ ప్లాన్ సిద్ధం చేసింది.

ఇదంతా బాగానే ఉంది కానీ ఏజెంట్ మీద ఇంకా అంచనాలు పెరగాలి. ఎల్లుండి 18న రాబోయే ట్రైలర్ చాలా కీలకం కానుంది. ఒకపక్క పొన్నియన్ సెల్వన్ 2 పోటీ కేరళ, తమిళనాడులో ఇబ్బంది పెట్టేలా ఉంది. దాన్ని ధీటుగా ఎదురుకోవాలంటే హైప్ ఎక్కడికో వెళ్ళిపోవాలి. పాటలు హిట్టయ్యాయి కానీ పూర్తి స్థాయిలో ఛార్ట్ బస్టర్ రేంజ్ కి చేరుకోలేదు. ఎలాగూ వేసవిలో దసరా తర్వాత ఆ స్థాయి హిట్ లేక టాలీవుడ్ బాక్సాఫీస్ నత్తనడకన సాగుతోంది. ఏజెంట్ కనక సరిగ్గా కనెక్ట్ అయితే రికార్డులు ఖాయమే కానీ బజ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లేలా ఈ పది రోజులు బాగా కష్టపడాలి.