ఈ ట్రాక్ రికార్డుతో పవన్ సినిమా సాధ్యమా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లిస్టులో ప్రస్తుతం చాలామంది దర్శకులే ఉన్నారు. ఇప్పటికే పవన్ నటిస్తున్న మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. కొన్ని వారాల పాటు విరామం లేకుండా ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌కు హాజరైన ఆయన, తర్వాత కాస్త బ్రేక్ తీసుకుని ‘వినోదియ సిత్తం’ రీమేక్‌లో తన పని పూర్తి చేశాడు. ఇటీవలే హరీష్ శంకర్‌ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదలుపెట్టాడు. కొన్ని రోజుల్లో ‘ఓజీ’ చిత్రీకరణకు కూడా హాజరవుతాడని ప్రచారం జరుగుతోంది.

మరోవైపేమో వేణు శ్రీరామ్ ‘వకీల్ సాబ్’ సీక్వెల్ ప్లానింగ్‌లో ఉన్నాడు. ఇంకా పవన్ కోసం ఎదురు చూస్తున్న దర్శకులు మరికొంత మంది ఉన్నారు. ఇప్పుడీ లిస్టులోకి సుధీర్ వర్మ సైతం వచ్చాడు. అతడి కొత్త చిత్రం ‘రావణాసుర’ రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్‌తో తాను ఓ సినిమా చేసే అవకాశం ఉందన్నాడు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ కథ అందిస్తాడని కూడా చెప్పాడు.

సుధీర్ మాటల్ని బట్టి చూస్తే పవన్‌తో అతడి సినిమా పక్కాగా ఉంటుందనే అనిపించింది. కానీ అతడి ట్రాక్ రికార్డు చూస్తే మాత్రం.. పవన్ అభిమానుల్లో భయం కలుగుతోంది. ‘స్వామి రారా’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన సుధీర్.. ఆ తర్వాత ఏ చిత్రంతోనూ మెప్పించలేకపోయాడు. దోచేయ్, రణరంగం, శాకిని డాకిని లాంటి డిజాస్టర్లు ఇచ్చాడు. ఇప్పుడు ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘రావణాసుర’ కూడా ఫ్లాప్ అని తేలిపోయింది. ‘కేశవ’ మాత్రమే పర్వాలేదనిపించేలా ఆడింది. టేకింగ్ విషయంలో మెప్పించినా.. అంతకుమించి సుధీర్ మెప్పించిందేమీ లేదు.

ఇలాంటి ట్రాక్ రికార్డున్న దర్శకుడిని నమ్మి పవన్ సినిమా చేస్తాడా.. ఒకవేళ చేసినా అది సరైన నిర్ణయమేనా అన్న చర్చ జరుగుతోంది. ఐతే పవన్ ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉంటాయో.. ఎవరికి అవకాశం ఇస్తాడో తెలియదు. కాబట్టి సుధీర్‌కు కూడా ఓ సినిమా ఇచ్చేస్తే ఆశ్చర్యమేమీ లేదు.