నాని 100 కోట్లు అందుకే స్పెషల్

న్యాచురల్ స్టార్ నాని దసరా రెండో వారంలోకి అడుగు పెట్టడం ఆలస్యం వంద కోట్ల గ్రాస్ ని అందుకుంది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెలని నమ్మినందుకు దానికి మించిన గొప్ప ఫలితం దక్కడం పట్ల ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. డెబ్యూ డైరెక్టర్ ఈ ఫీట్ సాధించడం కొత్త కాదు. ఉప్పెనతో బుచ్చిబాబు ఆల్రెడీ ఆ మార్కు అందుకున్నాడు. అది కూడా వైష్ణవ్ తేజ్ లాంటి కొత్త హీరోతో. అయినా కూడా దసరా వంద కోట్లకు చాలా ప్రత్యేకత ఉంది. ఒక్క నాని తప్ప ఈ సినిమాకు మార్కెటింగ్ పరంగా ఎలాంటి ఆకర్షణ లేదు. కీర్తి సురేష్ కొంతమేర తోడైనా మరీ ఎక్కువ కాదు.

కథను మలుపు తిప్పే సూరిగా దీక్షిత్ శెట్టి, విలన్ చిన్ననంబిగా చేసిన షైన్ టామ్ చాకో ఇద్దరూ కొత్తవారే. కానీ ఉప్పెనలో విజయ్ సేతుపతి లాంటి పవర్ ఫుల్ ప్రతినాయకుడు చాలా ప్లస్ అయ్యాడు. దానికి దేవిశ్రీ ప్రసాద్ రేంజ్ లో అన్ని పాటలు దసరాకు సంతోష్ నారాయణన్ ఇవ్వలేకపోయారు. దోస్తాన్, వదినే రెండు మాత్రమే ఛార్ట్ బస్టర్స్ అయ్యాయి. దసరా నిర్మాత వరస ఫ్లాపుల్లో ఉన్నారు. దీంతో అవుట్ రైట్ గా నైజాం ఏరియా హక్కులను దిల్ రాజుకు అమ్మేశారు. కట్ చేస్తే ఇప్పడొచ్చిన లాభాలతో సుధాకర్ చెరుకూరి ఏకంగా కోటి రూపాయల కారుని శ్రీకాంత్ కి గిఫ్ట్ గా ఇచ్చారు.

ఉప్పెన లాగా యూత్ ని ఆకట్టుకునే అంశాలు దసరాలో తక్కువ. హింస మోతాదు డామినేట్ చేసింది. అయినా కూడా టేకింగ్ లో నిజాయితీ, నాని వన్ మ్యాన్ షో అన్ని వర్గాలను అంగీకరించేలా చేసింది. ఇప్పటికి పూర్తయ్యింది మొదటివారమే కాబట్టి రేపు రిలీజ్ కాబోతున్న రావణాసుర, మీటర్ లకొచ్చే టాక్ ని బట్టి దసరా పికప్ ఏ స్థాయిలో ఉంటుందనేది అంచనా వేయొచ్చు. మాస్ హీరోగా నానికి యునివర్సల్ యాక్సెప్ టెన్స్ దొరికేసింది. ఈ తరహా సబ్జెక్టులతో మెప్పించవచ్చని శ్రీకాంత్ ఓదెల నిరూపించాడు. అందుకే దసరా 100 కోట్లు స్పెషల్ గా నిలిచిపోతుంది