తమిళంలో మణిరత్నం, శంకర్, బాలా తరహాలో చాలా తక్కువ సినిమాలతోనే గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు వెట్రిమారన్. ఎక్కువగా వాస్తవ ఘటనల ఆధారంగా రా అండ్ రస్టిక్ సినిమాలు తీసే వెట్రిమారన్.. సమాజంలో అణగారిన వర్గాలకు తన సినిమాల ద్వారా ఒక వాయిస్ ఇస్తుంటాడు. పొల్లాదవన్, ఆడుగళం, విసారణై, వడ చెన్నై, అసురన్.. ఇలా వెట్రిమారన్ ఏ సినిమా తీసిన అది కల్ట్ స్టేటస్ తెచ్చుకుంటూ ఉంటుంది. తాజాగా ఆయన్నుంచి వచ్చిన ‘విడుదలై’ సైతం అంతే గొప్ప పేరు సంపాదించింది.
గత వారమే తమిళంలో మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు అదిరిపోయే అప్లాజ్ వచ్చింది. తమిళంలో ఈ మధ్య కాలంలో వచ్చిన గొప్ప చిత్రాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. కమెడియన్ సూరి ఇందులో లీడ్ రోల్ చేయడం విశేషం. కామెడీకి పేరు పడ్డ నటుడితో సీరియస్ పాత్ర చేయించి గుండెలు పిండేయడం వెట్రిమారన్‌కే చెల్లింది.
తమిళంలో మంచి వసూళ్లతో సాగిపోతున్న ‘విడుదలై’ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే సంకేతాలు అందాయి. ఏదో ఆషామాషీగా కాకుండా తెలుగులో పక్కా ప్లాన్‌తోనే విడుదల చేయబోతున్నాడు ఒరిజినల్ ప్రొడ్యూసర్. ఈ సినిమాను తెలుగులో టాప్ ప్రొడక్షన్ హౌజ్‌ల్లో ఒకటైన గీతా ఆర్ట్స్ చేతికి అప్పగించారు.
గత ఏడాది ‘కాంతార’ సినిమాను గీతా ద్వారా రిలీజ్ చేస్తే ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. అలాగే ‘విడుదలై’ను కూడా అరవింద్ చేతికి అప్పగించేశారు. వెట్రిమారన్‌తో పాటు నిర్మాత వచ్చి అరవింద్‌ను కలవడం.. రిలీజ్ డీల్ ఓకే అవడం జరిగిపోయాయి. ఈ నెల 7నే తెలుగు రిలీజ్ అన్నారు కానీ.. ఆ రోజు రావణాసుర, మీటర్ రిలీజవుతుండటం.. ‘విడుదలై’కి ఇంకా తెలుగులో ప్రమోషన్ ఏదీ జరగకపోవడంతో రిలీజ్ హోల్డ్ చేసినట్లు తెలుస్తోంది. కొంచెం పబ్లిసిటీ బాగా చేసి ఈ నెల 14న రిలీజ్ చేయడానికి చూస్తున్నట్లు సమాచారం.