నేచురల్ స్టార్ నాని సినిమాలకు మంచి టాక్ వస్తే.. ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని చోట్లా బాగా ఆడతాయి. తెలంగాణలో రూరల్ ఏరియాల్లో నాని మార్కెట్ కొంచెం వీకే కానీ.. ఇక్కడి సిటీల్లో అతడి సినిమాలు బాగా ఆడతాయి. హైదరాబాద్ సంగతైతే చెప్పాల్సిన పని లేదు. ఇక ఆంధ్రా, రాయలసీమల్లో నానికి మంచి ఫాలోయింగే ఉంది. మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలకు వసూళ్ల విషయంలో ఢోకా ఉండదు. కానీ నాని కొత్త సినిమా ‘దసరా’ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.
ఈ సినిమాకు వచ్చిన టాక్‌కు, ఏపీలో వస్తున్న వసూళ్లకు పొంతన ఉండట్లేదు. పక్కా తెలంగాణ నేటివిటీతో తెరకెక్కిన ఈ సినిమా.. నైజాం ఏరియాలో దుమ్ము దులుపుతోంది. తొలి రోజే ఇక్కడ ఏడు కోట్లకు చేరువగా షేర్ వచ్చింది. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించిన దసరా వీకెండ్ అయ్యేసరికి తెలంగాణ అంతటా కలిపి రూ.18 కోట్లకు పైగా షేర్ రాబట్టి ఔరా అనిపించింది. టాప్ లీగ్ హీరోల రేంజ్ కలెక్షన్లు ఇవి.
కానీ ఏపీలో మాత్రం ‘దసరా’ మొదట్నుంచి అండర్ పెర్ఫామ్ చేస్తోంది. మామూలుగా కాస్త పేరున్న సినిమాలు ఏవైనా నైజాంతో పోలిస్తే ఏపీలో ఎక్కువ వసూళ్లు రాబడతాయి. ఐతే తొలి వారాంతంలో ‘దసరా’ ఏపీ కలెక్షన్లు రూ.14 కోట్ల షేర్, రూ.22 కోట్ల గ్రాస్‌కు పరిమితం అయ్యాయి. నైజాంతో పోలిస్తే పెద్ద మార్కెట్ ఉన్న ఏపీలో.. నైజాం వసూళ్లలో 70 శాతమే రావడం అనూహ్యం. ఇది ఎంత తెలంగాణ నేటివిటీతో తెరకెక్కిన సినిమా అయినప్పటికీ.. నానికి ఏపీలో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఈ వసూళ్లు తక్కువ అనే చెప్పాలి. తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు పెట్టిన పెట్టుబడి మీద ఇప్పటికే రెట్టింపు షేర్ రాబట్టిన ఈ చిత్రం.. ఏపీలో మాత్రం చాలా చోట్ల ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. బయ్యర్ల పెట్టుబడిలో 60-70 శాతం మధ్యే వెనక్కి తెచ్చింది. పరిస్థితి చూస్తుంటే.. ఏపీలో ‘దసరా’ బయ్యర్లకు చెప్పుకోదగ్గ నష్టాలు వచ్చేలా కనిపిస్తున్నాయి.