తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న నటుడు సూపర్ స్టార్ కృష్ణ. కథానాయకుడిగా ఆయన చూసిన వైభవం గురించి చెప్పడానికి చాలానే ఉంది. వ్యక్తిత్వ పరంగానూ కృష్ణ ఎంతో ఎత్తులో నిలుస్తారు. ఐదు దశాబ్దాల పాటు తన అభిమానులను అలరించిన కృష్ణ.. చివరి పదేళ్లలో మాత్రమే సినిమాల్లో యాక్టివ్‌గా లేరు.
అనారోగ్య కారణాలతో ఆయన కొన్ని నెలల కిందటే కన్నుమూసి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను శోక సంద్రంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. కృష్ణ మరణానంతరం తొలి పుట్టిన రోజు మే 31న రాబోతోంది. ఆ రోజు మహేష్ కొత్త సినిమా టీజర్ లాంచ్ చేయాలని ప్లానింగ్ నడుస్తోంది. కృష్ణకు ట్రిబ్యూట్‌గా ఉండేలా ఈ టీజర్ ఉంటుందని అంటున్నారు. దీంతో పాటు కృష్ణ అభిమానులకు ఇంకో మరపురాని కానుక అందబోతోంది.
కృష్ణ కెరీర్లో ఎన్నో సంచలనాలకు తెరతీసిన మోసగాళ్లకు మోసగాడు సినిమా ఈసారి ఆయన జయంతికి రీరిలీజ్ కాబోతోంది. 42 ఏళ్ల కిందటి ఈ చిత్రాన్ని ఇప్పుడు 4కే రెజల్యూషన్లో అధునాతనంగా అందించబోతున్నారు. ఇండియాలో వచ్చిన తొలి కౌబాయ్ చిత్రంగా రికార్డు సృష్టించిన మోసగాళ్లకు మోసగాడు.. 1971లో విడుదలై భారీ విజయం సాధించింది.
కేఎస్ఆర్ దాస్ రూపొందించిన ఈ చిత్రాన్ని కృష్ణే స్వయంగా నిర్మించారు. అప్పట్లో ప్రేక్షకులను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లిన ఈ చిత్రం కృష్ణ అభిమానులకు ఎప్పటికీ మరిచిపోలేని మధుర జ్ఞాపకమే. ఇలాంటి సినిమాను కృష్ణ మరణానంతరం తొలి పుట్టిన రోజుకు స్పెషల్ షోగా వేయనున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లు చాలా ఆకర్షణీయంగా, కృష్ణ అభిమానులను ఎగ్జైట్ చేసేలా ఉన్నాయి. కాబట్టి మే 31న కృష్ణ అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే సందడి చేసేలా ఉన్నారు.