ఇది సుకుమార్ శిష్యుల దండయాత్ర

దర్శకులు కావడానికి ముందు చాలామంది ఎన్నో కష్టాలు పడతారు. అవమానాలు ఎదుర్కొంటారు. తాము దర్శకులమై ఒక స్థాయి అందుకున్నాక అక్కడి దాకా రావడానికి పడ్డ కష్టాలు మరిచిపోతుంటారు. తమ అసిస్టెంట్ల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేంత పెద్ద మనసు అందరికీ ఉండదు. కానీ టాలీవుడ్ అగ్ర దర్శకుడు సుకుమార్ ఈ కోవలోకి రారు. ఆయన తన శిష్యుల మీద చూపించే ప్రేమ, శ్రద్ధ గురించి టాలీవుడ్లో ఎప్పుడూ చర్చ జరుగుతుంటుంది.

తన శిష్యులందరూ దర్శకులు అయిపోవాలని, మంచి పేరు తెచ్చుకోవాలని సుకుమార్ కోరిక. దర్శకుడిగా ఒక స్థాయి అందుకున్న దగ్గర్నుంచి ఆయన తన అసిస్టెంట్లను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. పల్నాటి సూర్యప్రతాప్, జక్కా హరిప్రసాద్, బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదెల.. ఇలా సుకుమార్ శిష్యులు ఒకరి తర్వాత ఒకరు దర్శకులు అవుతున్నారు. సుకుమార్ శిష్యుల సక్సెస్ రేట్ కూడా బాగుంది.

సూర్యప్రతాప్ ‘కరెంట్’ సినిమాతో దెబ్బ తిన్నా.. ఆ తర్వాత ‘కుమారి 21 ఎఫ్’తో హిట్టు కొట్టాడు. ఈ మధ్య అతడి కొత్త సినిమా ‘18 పేజెస్’ కూడా సక్సెస్ అయింది. సుక్కుకు క్లోజ్ ఫ్రెండ్ కూడా అయిన జక్కా హరి ప్రసాద్ తొలి చిత్రం ‘దర్శకుడు’ తేడా కొట్టినా.. ‘ప్లే బ్యాక్’తో సక్సెస్ సాధించాడు. ఇక సుక్కు శిష్యుల్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిందంటే.. బుచ్చిబాబు సానానే. అతడి తొలి సినిమా ‘ఉప్పెన’ ఎంత పెద్ద బ్లాక్‌బస్టరో తెలిసిందే. ఇప్పుడు సుక్కు మరో అసిస్టెంట్ శ్రీకాంత్ ఓదెల కూడా బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీనే ఇచ్చాడు. అతడి తొలి చిత్రం ‘దసరా’ బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. సినిమా పెద్ద రేంజికి వెళ్లేలా ఉంది. ఇక వైష్ణవ్ తేజ్ కొత్త సినిమాను రూపొందిస్తున్న శ్రీకాంత్ రెడ్డి కూడా సుకుమార్ శిష్యుడే.

ఇంకా సుకుమార్ శిష్యరికంలో రాటుదేలుతున్న మరికొందరు అసిస్టెంట్లు కూడా ఉన్నారు. ఆల్రెడీ ‘చక్కిలిగింత’తో దర్శకుడిగా మారి, ఆ సినిమా ఫెయిల్యూర్‌తో వెనుకబడ్డ వేమారెడ్డి ఈసారి ఓ మంచి సినిమాతో రీఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. రచయితగా ఇప్పటికే మంచి పేరు సంపాదించిన శ్రీకాంత్ విస్సా కూడా దర్శకుడిగా మారే ప్రయత్నంలో ఉన్నాడు.

చూస్తుంటే రాబోయే కొన్నేళ్లలో టాలీవుడ్లో సుకుమార్ శిష్యుల హవా మామూలుగా ఉండేలా లేదు. బాలీవుడ్లో ఒకప్పుడు ‘వర్మ ఫిలిం ఫ్యాక్టరీ’ పేరుతో ఆర్జీవీ బోలెడంతమందికి లైఫ్ ఇచ్చినట్లే.. టాలీవుడ్లో ప్రస్తుతం సుకుమార్ ఎంతోమంది ప్రతాభావంతులను ప్రోత్సహిస్తున్నాడు.