ముగ్గురు కుర్రాళ్ళ ఫేమస్ అల్లరి

ఇటీవలే రైటర్ పద్మభూషణ్ తో సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకున్న ఛాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ మరో యూత్ ఫుల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మేం ఫేమస్ టైటిల్ తో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ జూన్ 2 థియేటర్లలో విడుదల కానుంది. ఇవాళ తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా టీజర్ లాంచ్ చేశారు. తెలిసిన మొహాలు పెద్దగా లేకపోయినా యువతను లక్ష్యంగా చేసుకుని దర్శకుడు సుమంత్ ప్రభాస్ దీన్ని తీర్చిదిద్దారు. ప్రముఖ ఆడియో సంస్థ లహరి దీనికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
కథేంటో లైట్ గా చెప్పేశారు.

స్టోరీ పాయింట్ జాతిరత్నాలుకి దగ్గరగా అనిపిస్తోంది. ఇంట్లో వాళ్ళతో మాటలు పడుతూ జులాయిగా తిరిగే ముగ్గురు కుర్రాళ్లకు ఊరంతా చుట్టాలే. ఎక్కడ గొడవ జరిగినా ఎక్కడ వేడుక కనిపించినా అక్కడ ప్రత్యక్షమవుతారు. వీళ్ళను చూసి చిన్న పిల్లలు సైతం ఫాలో అయ్యే పరిస్థితి. ఎలాగైనా ఫేమస్ కావాలని చూస్తున్న ఈ కుర్ర బ్యాచ్ కి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ప్రపంచానికి తామేంటో తెలియాలన్న తాపత్రయంతో ఉన్న పోరగాళ్ళు చివరికి ఏం చేశారన్నది తెరమీద చూడాలి. మెయిన్ ట్విస్టుని చూపించకుండా వీడియో తెలివిగా కట్ చేశారు.

ముందే చెప్పినట్టు మరీ కొత్తదనం కనిపించకయినా ఆడియన్స్ ని టైం పాస్ చేయించడమే కాన్సెప్ట్ గా తీసుకున్నారు. అసలు ప్లాట్ ని రివీల్ చేయలేదు కాబట్టి ట్రైలర్ వస్తే కానీ క్లారిటీ రాదు. బడ్జెట్ పరంగా రిస్క్ లేకుండా చూసుకుంది ఛాయ్ బిస్కెట్ బృందం. దాదాపు పల్లెటూరిలోనే మొత్తం తీసినట్టు ఉన్నారు. సుమంత్, మణి, మౌర్య, సార్య, సిరిరాసి, కిరణ్, అంజి తదితరులు ఇతర తారాగణం. కళ్యాణ్ నాయక్ సంగీతం, శ్యామ్ దూపాటి ఛాయాగ్రహణం సమకూర్చిన ఈ మేమ్ ఫేమస్ కూడా ఎలాంటి అంచనాలు లేకుండా ఏదైనా సర్ప్రైజ్ ఇస్తుందేమో చూడాలి.