కొన్ని నెలల కిందట స్వల్ప వ్యవధిలో ‘ధమాకా’, ‘ధమ్కీ’ సినిమాల ట్రైలర్లు రిలీజయ్యాయి. అవి చూస్తే రెండు సినిమాలకు చాలా పోలికలు కనిపించాయి. ఈ రెండు చిత్రాలకూ రచయిత ప్రసన్నకుమార్ బెజవాడనే కావడం విశేషం. మరి ఒకే రచయిత రెండు సినిమాలకు ఒకే రకమైన కథ ఇవ్వడమేంటి అనే చర్చ నడిచింది.
ఈ రెండు సినిమాల్లో ముందుగా ‘ధమాకా’ రిలీజై బ్లాక్‌బస్టర్ అయింది. ‘ధమ్కీ’ సినిమా రముందు అనుకున్న సమయానికి రిలీజ్ కాలేదు. కథలో పోలికల వల్ల తర్వాత మార్పులు చేర్పులు చేసి.. రీషూట్లు జరిపి నెల ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలపై ‘ధమ్కీ’ హీరో కమ్ డైరెక్టర్ విశ్వక్సేన్ స్పందించాడు.
ఒక రచయిత రెండు సినిమాలకు ఎక్కడైనా ఒకే కథ ఇస్తాడా అని విశ్వక్ ప్రశ్నించాడు. వేరే సినిమా కథతో పోలిక ఉన్న స్టోరీని తీసుకుని సినిమా చేయడానికి నేనేమైనా పిచ్చోడినా అని విశ్వక్ అన్నాడు. రెండు సినిమాలకు ఒకే కథ ఇచ్చి ప్రసన్న కుమార్ ఇండస్ట్రీలో తిరగగలడా అని విశ్వక్ ప్రశ్నించాడు. ‘ధమాకా’ సినిమాకు ‘ధమ్కీ’కి ఏ పోలికా లేదని.. ‘ధమ్కీ’లో తాను ద్విపాత్రాభినయం చేశానని విశ్వక్ తెలిపాడు. తన సినిమా రిలీజ్ ఆలస్యం కావడానికి కారణం.. రీషూట్లు కాదని, అలాంటివేమీ జరగలేదని అతను స్పష్టం చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్, సీజీ వర్క్ వల్లే రిలీజ్ లేటైందని అతను తెలిపాడు.
ఈ కథతో తాను బాగా కనెక్ట్ కావడం వల్లే స్వయంగా డైరెక్ట్ చేసినట్లు వెల్లడించాడు. తాను డైరెక్ట్ చేయాలనుకునే వేరే హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ మొదట ఉంటాడని.. ఆ తర్వాత బాలయ్యను సైతం డైరెక్ట్ చేయాలని ఉందని విశ్వక్ తెలిపాడు. అర్జున్‌తో వివాదం గురించి స్పందిస్తూ.. తన గురించి ఆయన ప్రెస్ మీట్ విషయంలో ఇప్పటికీ తనకు క్వశ్చన్ మార్క్ ఉందని వ్యాఖ్యానించాడు.