బాహుబలితో సూర్య 42 పోలిక అవసరమా

బాహుబలితో ఎప్పుడైతే తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయిలో గర్వంగా నిలబెట్టాడో అప్పటి నుంచి రాజమౌళిని మించి అలాంటి ప్యాన్ ఇండియా మూవీస్ తీయాలని తపించిపోయిన దర్శక నిర్మాతలు అన్ని ఇండస్ట్రీస్ లోనూ ఉన్నారు. తమిళంలో విజయ్ ఏరికోరి పులి అనే కళాఖండం చేశాడు. అతిలోకసుందరి శ్రీదేవి, కిచ్చ సుదీప్ లాంటి సపోర్టింగ్ క్యాస్ట్ ఎంత ఉన్నా అది దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఇదే తరహాలో ఖుష్బూ భర్త సి సుందర్ అయిదు వందల కోట్ల బడ్జెట్ తో సంఘమిత్ర అనే మల్టీస్టారర్ ప్రకటించి పోస్టర్ వదిలి అక్కడితో ఆపేయడం మీడియాకు గుర్తే.

ఇటీవలే పొన్నియిన్ సెల్వన్ 1ని ఆ రేంజ్ లోనే ప్రమోట్ చేశారు కానీ అరవంలో తప్ప దానికి ఇతర భాషల్లో రెస్పాన్స్ రాలేదు. అయినా సరే బాహుబలిని మించి తీస్తామని అక్కడి నిర్మాతలు స్టేట్ మెంట్లు ఇస్తూనే ఉన్నారు. సూర్య 42 నిర్మాత జ్ఞానవేల్ రాజా కోలీవుడ్ నుంచి అందరికీ సమాధానం ఇచ్చే స్థాయిలో ఈ పీరియాడిక్ డ్రామాని రూపొందిస్తున్నామని వెయ్యేళ్ళ వెనుక జరిగిన కథతో ఇది తెరకెక్కుతోందని ఊరిస్తున్నారు. రజనీకాంత్ కి పెద్దన్న రూపంలో అల్ట్రా డిజాస్టర్ ఇచ్చిన శివ దీనికి దర్శకుడు. బడ్జెట్ కూడా తమిళంలో ఇప్పటిదాకా ఎవరూ పెట్టనంత ఖర్చుతో చేస్తన్నారట.

ఇందులో సూర్య మొత్తం అయిదు పాత్రలు చేస్తున్నాడు. దిశా పటాని హీరోయిన్ గా నటిస్తోంది. పది భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే నెల టీజర్ లాంచ్ చేసి విడుదల తేదీ ఎప్పుడనేది ప్రకటించబోతున్నారు. అంతా బాగానే ఉంది కానీ పదే పదే బాహుబలిని మించి అనే బిల్డప్ లు ఇవ్వడమే అవసరం లేని ట్రోలింగ్ కి దారి తీస్తుంది. సూర్య మాములు కమర్షియల్ సినిమాకే విపరీతంగా కష్టపడతాడు. అలాంటిది దీనికే స్థాయిలో వర్క్ చేస్తున్నాడో చెప్పనవరం లేదు. అయినా రిలీజయ్యాక సినిమా మాట్లాడితే బాగుంటుంది కానీ మాటలతో కాదుగా.