పాయల్ ఘోష్.. చేసింది తక్కువ సినిమాలే అయినా.. సినిమాయేతర విషయాలతో కొన్నేళ్ల నుంచి వార్తల్లో నిలుస్తూ వస్తోంది ఈ ముంబయి భామ. తెలుగులో మంచు మనోజ్ సరసన ‘ప్రయాణం’తో కథానాయికగా మారిన ఆమె.. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో కలిసి ‘ఊసరవెల్లి’లో నటించింది.
హిందీలో కూడా కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత అవకాశాలు లేక సైలెంట్ అయిపోయిన పాయల్.. కొన్నేళ్ల కిందట లైంగిక వేధింపుల ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. బాలీవుడ్లో చాలా తక్కువ సినిమాలతోనే మేటి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనురాగ్ కశ్యప్ మీద ఆమె తీవ్ర ఆరోపణలే చేసింది. అనురాగ్ తన మీద లైంగిక దాడి జరిపినట్లు ‘మీ టూ’ మూమెంట్ గట్టిగా జరుగుతున్న టైంలో ఆమె ఆరోపించింది. ఈ ఆరోపణలపై అనురాగ్ పెద్దగా స్పందించింది లేదు.
కానీ పాయల్ మాత్రం అనురాగ్‌ను వదలట్లేదు. తాను ఎప్పుడూ సౌత్ సినిమాల గురించే ఎందుకు గొప్పగా మాట్లాడతానో వివరిస్తూ మరోమారు అనురాగ్ మీద ఆమె ఆరోపణలు గుప్పించింది. “గతంలో నేను సౌత్ సినిమాల్లో నటించా. జాతీయ అవార్డులు పొందిన ఇద్దరు దర్శకులతో పని చేశా. ఆ ఇద్దరూ నాకెంతో గౌరవం ఇచ్చారు. ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించలేదు. కానీ బాలీవుడ్ విషయానికి వస్తే.. అనురాగ్ కశ్యప్‌తో నేను అస్సలు పని చేయలేదు. కానీ అతను నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మా ఇద్దరి మధ్య ఓ సినిమాకు సంబంధించి కొన్ని మీటింగ్స్ జరిగాయి. మూడో మీటింగ్‌లోనే అతను నా మీద లైంగిక దాడి చేశాడు. ఇప్పుడు చెప్పండి నేను.. దక్షిణాది సినిమాల గురించి ఎందుకు గొప్పగా చెప్పకూడదు” అని పాయల్ ప్రశ్నించింది.
అనురాగ్ సినిమా అవకాశం కోసం తనను ఇంటికి పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డట్లు మూడేళ్ల కిందట పాయల్ చేసిన ట్వీట్ దుమారం రేపింది. అంతే కాక అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐతే ఆ కేసులో ఏ పురోగతీ లేదని పాయల్ తాజగా వ్యాఖ్యానించింది.