‘నాటు నాటు’పై బాలీవుడ్ ఓపెన్ ఏడుపు


కొన్నేళ్లుగా నార్త్ మార్కెట్‌ను సౌత్ సినిమాలు దున్నేస్తుండటంపై బాలీవుడ్ జనాల ఏడుపు మామూలుగా లేదన్నది స్పష్టం. ‘బాహుబలి’ సినిమాను నెత్తిన పెట్టుకుని ప్రమోట్ చేసి, పొగిడిన బాలీవుడ్ జనాలు.. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. ఈ సినిమాను ప్రోత్సహించి తమ కొంపకు తామే నిప్పు పెట్టుకున్నామన్న ఫీలింగ్‌లో వాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. రాజమౌళి తర్వాతి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ కూడా నార్త్ ఇండియాలో సంచలనం రేపినా.. దాని గురించి అందరూ గప్‌చుప్ అయిపోయారు.

బాలీవుడ్ సినిమాలు దారుణంగా బోల్తా కొడుతున్న టైంలోనే పుష్ప, కేజీఎఫ్-2, కార్తికేయ-2 లాంటి సౌత్ సినిమాలు హిందీలో ఇరగాడేయడం వారికి కంటగింపుగా మారింది. ఇక తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఏకంగా ఆస్కార్ అవార్డును కొల్లగొట్టేయడంతో బాలీవుడ్ వాళ్ల బాధ అంతా ఇంతా కాదు.

ఇండియా అంతా గర్విస్తున్న ఈ విషయం గురించి బాలీవుడ్ సెలబ్రెటీలెవ్వరూ ట్వీట్ వేసి రాజమౌళి టీంకు అభినందనలు చెప్పడం లేదంటే వాళ్ల కడుపు మంట ఏ స్థాయిలో ఉందో అర్థమైపోతుంది. ‘ఆర్ఆర్ఆర్’ టీంను అభినందించకపోవడమే ఆశ్చర్యం అంటే.. అక్కడి జనాలు కొందరు ఓపెన్‌గా ఈ పాట సాధించిన విజయం మీద ఏడుస్తుండటం విడ్డూరం. స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మేకప్ మ్యాన్ షాన్ ముట్టతిల్.. ‘నాటు నాటు’ ఆస్కార్ విజయం మీద చీప్‌గా మాట్లాడాడు.

ఇప్పటిదాకా ఇండియాలో మాత్రమే అవార్డులు కొనుక్కోవచ్చు అనుకునేవాళ్లమని, కానీ ఆస్కార్ అవార్డును కూడా కొనేయొచ్చని ‘నాటు నాటు’ పాటకు వచ్చిన పురస్కారం రుజువు చేసిందని అతను ఆరోపించాడు. అంటే రాజమౌళి టీం డబ్బు పెట్టి ఈ అవార్డును కొందన్నది అతడి ఉద్దేశమన్నమాట. ఈ కామెంట్ మీద నార్త్ ఇండియన్స్ సైతం విరుచుకుపడుతున్నారు. మరోవైపు అనన్య ఛటర్జీ అనే హీరోయిన్ సైతం ‘నాటు నాటు’ పాటను తక్కువ చేసే ప్రయత్నం చేసింది. ఈ పాటను చూసి మనం గర్వపడాల్సిన అవసరం లేదని.. అందులో అంతేం విశేషం ఉందని ఆమె వ్యాఖ్యానించింది.