పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో సముతిరఖని దర్శకత్వంలో రూపొందుతున్న వినోదయ సితం రీమేక్ శరవేగంగా జరుగుతోంది. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిన్న బ్రేక్ తీసుకున్న పవన్ అది పూర్తవ్వడంతో ఈ రెండు మూడు రోజుల్లోనే కొత్త షెడ్యూల్ లో చేరబోతున్నాడు. ఇప్పటిదాకా జరిగిన చిత్రీకరణలో ముప్పై శాతానికి పైగానే టాకీ పార్ట్ పూర్తయ్యిందని ఇన్ సైడ్ టాక్. తనకు రోజుకు రెండు కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నారని ఒక సినిమాకు నలభై కోట్లకు పైగా కేవలం ఇరవై రోజుల్లో సంపాదిస్తున్నానని పవన్ చెప్పింది ఈ మూవీ గురించే.
ఇదంతా బాగానే ఉంది కానీ తాజాగా దీనికీ లీకుల బెడద మొదలయ్యింది. మామ అల్లుళ్ళ మొదటి కలయిక కాబట్టి ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ దాకా ప్రతిదీ స్పెషల్ గా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పిక్స్ చూస్తేనేమో వాళ్ళిద్దరి కాంబోలోవే ఉన్నాయి. కారులో ఇద్దరు ప్రయాణం చేస్తున్న సీన్ ఒకటికాగా మరొకటి సముద్రం ఒడ్డున ఏదో మాట్లాడుకుంటున్నట్టుగా ఉండే సన్నివేశం మరొకటి. రెండింటిలోనూ పవన్ డ్రెస్సింగ్ స్టయిల్ చాలా ట్రెండీగా ఉంది. యువకుడైన తేజుని సైతం డామినేట్ చేస్తున్నాడు.
ఇవి అభిమానుల్లో ఉత్సాహం ఇస్తున్నప్పటికీ ఈ లీకులు బయటికి ఎలా వచ్చాయో తెలుసుకునే పనిలో నిర్మాతలున్నారు. అయినా ఎంత వెతికినా దొంగలు దొరికే పరిస్థితి ఎక్కడుంది. వీడియో కాదు కాబట్టి అక్కడికి అదృష్టం అనుకోవాలి. వీలైనంత త్వరగా ఫస్ట్ లుక్ విడుదల చేయమని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన చేసిన ఈ ఫాంటసీ డ్రామాలో పవన్ మనిషి రూపంలో వచ్చే విధి పాత్రను పోషిస్తుండగా కుటుంబ సమస్యలతో సతమతమయ్యే చిరుద్యోగిగా సాయి ధరమ్ తేజ్ కనిపిస్తాడు. తమన్ హ్యాట్రిక్ సంగీతాన్ని సిద్ధం చేస్తున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates