రెహమాన్ పోలిక అవసరమే లేదు

ఒక తెలుగు సినిమా పాటకు మొదటిసారి ఆస్కార్ అవార్డు దక్కడం ఎందరికో కంటగింపుగా మారింది. దాన్ని ఎలాగైనా తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఏ కోణంలో దీన్ని తక్కువ చేద్దామాని రకరకాల దారులు వెతుకుతున్నారు. దానికి తమిళ అభిమానులు తోడవుతున్నారు. పొన్నియన్ సెల్వన్ 1కి ఈ స్థాయిలో గుర్తింపు రాలేదనే బాధ కూడా ఈ మద్దతుకి కారణమని చెప్పాలి. వీళ్ళందరూ తీసుకున్న సాకు ఏఆర్ రెహమాన్. ఎప్పుడో 2008లో స్లమ్ డాగ్ మిలీనియర్ కు సాధించాడు కాబట్టి అతను మన దేశానికి ముందు గర్వకారణం అవుతాడు తప్పించి కీరవాణి కాదనేది సదరు బ్యాచ్ వెర్షన్.

ఇది ఎంత మాత్రమూ సమ్మతం కాదు. ఎందుకంటే రెహమాన్ కంపోజ్ చేసిన స్లమ్ డాగ్ మిలియనీర్ ఒక బ్రిటిష్ ఫిలిం. కాకపోతే నేపథ్యం ముంబై మురికివాడలను తీసుకున్నారు అంతే. దర్శకుడు, నిర్మాతలు ముఖ్య తారాగణం తదితరులంతా మన దేశం వాళ్ళు కాదు. అంతెందుకు దానికి పని చేసిన మొత్తం టీమ్ లో ఏఆర్ రెహమాన్ ఒక్కడే ఇండియన్. మరో ముఖ్యమైన విషయం ఈ సినిమాకు సుప్రసిద్ధ ఫాక్స్ తో పాటు వార్నర్ బ్రదర్స్ ప్రొడక్షన్ పార్ట్ నర్స్ గా ఉన్నాయి. వీటికి ఆస్కార్ అకాడెమితో ఉన్న అనుబంధం తెలిసిందే. వివక్ష చూపిస్తారని కాదు కానీ ప్రత్యేకంగా మార్కెటింగ్ అవసరం లేదు.

కానీ ఆర్ఆర్ఆర్ ఆలా కాదు. డైరెక్టర్ తో మొదలుపెట్టి లైట్ బాయ్ దాకా అందరూ అత్యధిక శాతం మనవాళ్లే. తమిళనాడు మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన సాంకేతిక నిపుణులు ఉంటారు కానీ మన దేశపు ఓటర్ కార్డు ఉన్న బృందమే. జక్కన్న స్వంతంగా తన కష్టంతో డబ్బుతో ట్రిపులార్ ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. అసలు నిర్మాత దానయ్య ఇందులో కలగజేసుకోకపోవడంతో మొత్తం భారం రాజమౌళి మీదే పడింది. అబ్బాయి కార్తికేయ అండగా నిలబడి అన్నీ చూసుకున్నాడు. పైన చెప్పిన ఉదాహరణలో రెహమాన్ అవేవి చేయలేదు. అందుకే అసలా పోలికే కరెక్ట్ కాదు. ప్యూర్ ఇండియన్ ఆస్కార్ మనదే అవుతుంది.