నవ్వులపాలైన కొత్త డైనోసర్లు

ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం స్టీవెన్ స్పీల్బర్గ్ వెండితెర మీద జురాసిక్ పార్క్ అనే అద్భుతం ఆవిష్కరించినప్పుడు ప్రపంచం మొత్తం నివ్వెరపోయి చూసింది. భాష రానోళ్లు కూడా థియేటర్లకు పోటెత్తారు. ఫలితంగా దేశంతో సంబంధం లేకుండా అన్ని చోట్ల రికార్డు వసూళ్లు దక్కాయి. ఇప్పుడున్న టెక్నాలజీ ఆ టైంలో లేకపోయినా రాకాసి బల్లుల్లను సృష్టించిన తీరు ఎందరికో దారి చూపించింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ జానర్ లో ఇదే బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి. మొదట్లో బాగానే అనిపించేవి కానీ క్రమంగా జనానికి వీటి మీద ఆసక్తి తగ్గిపోయించి.

అందుకే గత ఏడాది వీటికి శుభం పలుకుతూ జురాసిక్ వరల్డ్ డామినియన్ ని రిలీజ్ చేస్తే మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో పబ్లిక్ కి మొహం మొత్తిపోయిందని అర్థమైపోయింది. అయినా కొందరు ఇంకా డైనోసర్ల చుట్టే తిరుగుతున్నారు. నిన్న 65 మిలియన్ ఇయర్స్ అగో అనే భారీ చిత్రమొకటి రిలీజయ్యింది. చెప్పుకోదగ్గ కొత్త విడుదలలు లేకపోవడంతో ఇలాంటివి ఇష్టపడే ఆడియన్స్ ఓ లుక్ వేద్దామని ట్రై చేశారు. ప్రమాదశావత్తు ఓ ద్వీపంలో అడుగుపెట్టిన వ్యోమగామి, ఓ తోమిదేళ్ళ అమ్మాయికి అక్కడ ప్రమాదకరమైన రాకాసి బల్లులు ఉన్నాయని అర్థమవుతుంది.

ఆ తర్వాత ఏమవుతుందో సులభంగా ఊహించుకోవచ్చు. ఆ మధ్య బెస్ట్ హారర్ మూవీగా పేరు తెచ్చుకున్న ఏ క్వయిట్ ప్లేస్ రచయితల సృష్టి ఇది. ప్లాట్ ఎంత పాతదైనా థ్రిల్ కలిగించేలా 65ని తీయడంలో దర్శకులు స్కాట్ బెక్ – బ్రియాన్ వుడ్స్ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ఫలితంగా గతంలో ఎన్నోసార్లు చూసిన సన్నివేశాలు, గ్రాఫిక్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది తప్పించి కనీసం యావరేజని చెప్పడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఎక్స్ పైరి డేట్ అయిపోయిన మందుల్లా ఇకనైనా డైనోసర్ల కళాఖండాలు ఆపేయడం మంచిది.