అవ‌స‌రాల సినిమా క‌ష్టాలు

న‌టుడిగా ప్ర‌యాణం ఆరంభించి.. ద‌ర్శ‌కుడిగా మారి.. గొప్ప అభిరుచిని చాటుకున్నాడు అవ‌స‌రాల శ్రీనివాస్. ద‌ర్శ‌కుడిగా అత‌డి తొలి చిత్రం ఊహ‌లు గుస‌గుస‌లాడే చూసి చాలామంది ఫిదా అయిపోయారు. ఐతే తొలి సినిమా త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకుని అత‌ను జ్యో అచ్యుతానంద తీశాడు. అది కూడా మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. క‌మ‌ర్షియ‌ల్‌గానూ స‌క్సెస్ అయింది.

ఐతే ద‌ర్శ‌కుడిగా అవ‌స‌రాల మూడో సినిమా కోసం చాలా కాలం ఎదురు చూడాల్సి వ‌చ్చింది. జ్యో అచ్యుతానంద ఎప్పుడో 2016లో విడుద‌లై.. ఇంకో ఏడేళ్ల‌కు కానీ అత‌డి కొత్త సినిమా ఫ‌లానా అబ్బాయి ఫ‌లానా అమ్మాయి రిలీజ్ కావ‌ట్లేదు. మ‌రీ ఇంత గ్యాప్ ఏంటి అని అవ‌స‌రాల‌ను అడిగితే.. ఈ సినిమా పూర్తి చేయ‌డంలో త‌లెత్తిన ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చాడు.

నేను బేసిగ్గానే సినిమా కొంచెం నెమ్మ‌దిగా తీస్తాను. స్క్రిప్టు రాయ‌డానికి ఏడాది నుంచి ఏడాదిన్న‌ర స‌మ‌యం ప‌డుతుంది. ఫ‌లానా అబ్బాయి ఫ‌లానా అమ్మాయి చిత్రానికి స్క్రిప్టు కోసం ఇంకొంచెం ఎక్కువ స‌మ‌య‌మే ప‌ట్టింది. నాకెంతో ఇష్ట‌మైన‌ బిఫోర్ స‌న్‌రైజ్ అనే ఇంగ్లిష్ సినిమా త‌ర‌హాలో ఈ చిత్రం చేయాల‌నుకున్నా. ఇలాంటి సినిమాల‌కు స్క్రిప్టెడ్ డైలాగ్స్ ఉంటే బాగుండ‌దు. స‌హ‌జంగా అనిపించాలి. తెర‌మీద మ‌నుషులు మాట్లాడుకుంటున్న‌ట్లు అనిపించాలే త‌ప్ప.. డైలాగులు చెబుతున్న‌ట్లు ఉండ‌కూడ‌దు. అందుకే స్క్రిప్టు ఆల‌స్యం అయింది.

ఇక షూట్ మొద‌ల‌య్యాక యూకేలో పెద్ద షెడ్యూల్ అనుకున్నాం. కానీ అంత‌లోనే క‌రోనా వ‌చ్చి వీసాలు ఇవ్వ‌డం ఆపేశారు. చాన్నాళ్ల‌ నిరీక్ష‌ణ త‌ర్వాత వీసాలు ఇచ్చారు కానీ.. 40 మందికి అడిగితే 10 మందికి మాత్ర‌మే వీసాలు వ‌చ్చాయి. ఇంత త‌క్కువ‌మందితో షూట్ చేయ‌డం చాలా క‌ష్ట‌మైంది. ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల సినిమా ఆల‌స్య‌మైంది. నిర్మాత‌లు ఎంతో ఓపిగ్గా ఎదురు చూశారు. మేం షూట్ టైంలో ఎంత క‌ష్ట‌ప‌డ్డా.. నాగ‌శౌర్య న‌ట‌న‌తో ఆ క‌ష్టాన్ని మ‌రిచిపోయేలా చేశాడు అని అవ‌స‌రాల తెలిపాడు.