ఏళ్ళ తరబడి ఎదురు చూసిన కష్టానికి ఫలితం ఒక్క సినిమాతో దక్కుతుందని చెప్పడానికి ఇండస్ట్రీలో ఎన్నో ఉదాహరణలున్నాయి కానీ కొన్ని మాత్రం ప్రత్యేకం అనిపిస్తాయి. సూర్యతో జై భీమ్ తీసిన దర్శకుడు టిజె జ్ఞానవేల్ మరో ఎగ్జాంపుల్ గా నిలుస్తున్నాడు. తన మూడో చిత్రమే ఏకంగా సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేసే అదృష్టాన్ని దక్కించుకున్నాడు. అది కూడా కోట్ల రూపాయల బడ్జెట్ ని మంచి నీళ్లలా ధారపోసే లైకా ప్రొడక్షన్స్ లాంటి నిర్మాణ సంస్థతో. ఇవాళే అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. 2024 విడుదల ప్లాన్ చేసుకుని త్వరలో షూట్ మొదలుపెడతారు.
ఈ జ్ఞానవేల్ మొదటి మూవీ 2017లో వచ్చిన కూటత్తిల్ ఒరుతన్. అశోక్ సెల్వన్, ప్రియా ఆనంద్ జంటగా తీశారు. పెద్దగా ఆడలేదు. రివ్యూలు కూడా సోసోనే. రొమాంటిక్ కామెడీగా ఏదో ట్రై చేద్దామనుకున్నారు కానీ వర్కౌట్ కాలేదు. అయితే రక్త చరిత్ర 2 తమిళ వెర్షన్ కి రచయితగా పని చేసినప్పుడు సూర్యతో మొదలైన జ్ఞానవేల్ స్నేహం కథ చెప్పేలా ప్రేరేపించింది. నాగార్జున గగనం వర్క్ కూడా నచ్చడంతో తన మనసులో ఎప్పటి నుంచో ఉన్న జై భీమ్ కి రూపకల్పన చేసి సూర్యతో ఏకంగా డైరెక్షన్ ఛాన్స్ కొట్టేశాడు. కట్ చేస్తే అది ఓటిటిలో వచ్చినా అంతర్జాతీయ స్థాయిలో మెప్పు పొందింది.
దీంతో దారి రజనీకాంత్ దాకా వెళ్లేందుకు సుగమం చేసింది. ఇప్పుడీ కాంబోకి అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నాడు. రజిని ప్రస్తుతం జైలర్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీపావళి లేదా దసరా టార్గెట్ గా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇది కాకుండా కూతురు ఐశ్వర్య డైరెక్ట్ చేస్తున్న స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలో స్పెషల్ క్యామియో చేస్తున్నారు. ఇవి అయ్యాక జ్ఞానవేల్ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కుతుంది. ప్రస్తుతం 170 సినిమాల మైలురాయి వద్ద ఉన్న తలైవా డబుల్ సెంచరీ చేయాలనీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు కానీ వయసు ఆరోగ్యం రిత్యా అదంత సులభమైతే కాదు.