ఇంకేం రీమేక్ చేస్తారు?

రీమేక్ సినిమాలు ఆ భాష, ఈ భాష అని తేడా లేకుండా అన్ని చోట్లా నిరాశాజనక ఫలితాలే అందిస్తున్నాయి. మాతృకలో మార్పులు చేసి, అదనపు హంగులు జోడించినా కూడా పెద్దగా ఫలితం ఉండట్లేదు. ఓటీటీ కాలంలో అన్ని భాషల చిత్రాలనూ అందరూ చూసేస్తుండడం.. రీమేక్ అనగానే ఆసక్తి కోల్పోతుండటం ఈ ఫలితాలకు కారణం. అయినా సరే.. రీమేక్‌ల పట్ల దర్శక నిర్మాతల మోజు తగ్గట్లేదు.

తాజాగా బాలీవుడ్‌కు ఒక రీమేక్ మూవీ దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. అదే.. సెల్ఫీ. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘డ్రైవింగ్ లైసెన్స్‌’కు ఇది రీమేక్. ఈ సినిమా రిలీజైనపుడే పలు భాషల్లో రీమేక్ గురించి వార్తలు వచ్చాయి. తెలుగులో రామ్ చరణ్ హీరోగా ఈ సినిమాను రీమేక్ చేస్తారని వార్తలు వచ్చాయి. తర్వాత రవితేజ పేరు కూడా వినిపించింది. కానీ ఇక్కడ ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు.

ఇంతలో హిందీలో అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రల్లో ‘సెల్ఫీ’ పేరుతో రీమేక్ తీసేశారు. ప్రమోషన్లలో చాలా హడావుడే చేసింది చిత్ర బృందం. ఇప్పటిదాకా చాలా వరకు ట్రెడిషనల్‌గా కనిపించిన మృణాల్ ఠాకూర్ ఈ చిత్రం కోసం హాట్ హాట్‌గా తయారవడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ట్రైలర్ కూడా ఆసక్తికరంగానే ఉండడంతో సినిమాకు మంచి వసూళ్లే వస్తాయనుకున్నారు. కానీ తీరా చూస్తే సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవం తప్పలేదు. తొలి రోజు కేవలం రూ.2 కోట్ల కలెక్షన్లకు పరిమితం అయింది ఈ చిత్రం.

అక్షయ్ హీరోగా నటించిన సినిమాకు ఇలాంటి వసూళ్లంటే అనూహ్యం. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేస్తోందని అర్థమైపోయింది. రీమేక్ కావడం కూడా ఈ సినిమా పట్ల ప్రేక్షకుల అనాసక్తికి కారణమని తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ ముందు వరకు తెలుగు రీమేక్ ఉంటుందనే అనుకున్నారు. కానీ హిందీలో ఇలాంటి ఫలితం దక్కాక తెలుగు రీమేక్ అటకెక్కేస్తుందనడంలో సందేహం లేదు.