అమెరికాలో రామ్ చరణ్ హంగామా

శంకర్ సినిమా కోసం రెస్టు లేకుండా నాన్ స్టాప్ గా షూటింగుల్లో పాల్గొన్న రామ్ చరణ్ ఇప్పుడు యుఎస్ లో హల్చల్ చేస్తున్నాడు. మాములుగా హాలీవుడ్ స్టార్లు మాత్రమే పాల్గొనే గుడ్ మార్నింగ్ అమెరికా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వెళ్లడం, దాని తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం ఫ్యాన్స్ కి మాములు ఆనందాన్ని ఇవ్వడం లేదు. చిరంజీవి మరోసారి ఈ సంతోషాన్ని షేర్ చేసుకుంటూ ట్వీట్ పెట్టారు. అయితే ఈసారి నెటిజెన్ల సునిశిత దృష్టిని, ట్రోలింగ్ ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు రాజమౌళి పేరుని ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం.

అక్కడ చరణ్ కు గ్రాండ్ వెల్కమ్ దక్కింది. భారత కాలమాన ప్రకారం నిన్న మధ్యాన్నం ఈ ప్రోగ్రాం జరిగిపోయింది. అందులో జరిగిన సంభాషణ తాలూకు ముఖ్యమైన వీడియోలు ఆల్రెడీ చక్కర్లు కొడుతున్నాయి. ఇదే కాదు బెవర్లీ హిల్స్ లో జరిగే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు ఫంక్షన్ లోనూ మెగా పవర్ స్టార్ అతిథిగా పాల్గొనబోతున్నాడు. మార్చి 12న జరగబోయే గ్రాండ్ ఆస్కార్ ఈవెంట్ వరకు రామ్ చరణ్ మకాం పూర్తిగా అక్కడే ఉండబోతోంది. జక్కన్న, ఇతర టీమ్ సభ్యులు త్వరలో జాయినవుతారు. నాటు నాటుకి పురస్కారం ఖాయమనే అంచనా బలంగా ఉంది.

ఇక జూనియర్ ఎన్టీఆర్ కు ఇటీవలే తారకరత్న విషాదం వల్ల వెంటనే వెళ్లలేని పరిస్థితి నెలకొంది. నిజానికి కొరటాల శివ కొత్త సినిమా ఓపెనింగ్ ని చేసేసి కొంత షూట్ అయ్యాక రోజుల గ్యాప్ లో న్యూయార్క్ వెళ్లేందుకు తారక్ ప్లాన్ చేసుకున్నాడు. ఈలోగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇంకో వారం రోజుల తర్వాత బయలుదేరతాడని తెలిసింది. మొత్తానికి ఆర్ఆర్ఆర్ తాలూకు ప్రకంపనలు వరల్డ్ వైడ్ ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఒకవేళ స్వప్నం సాకారమై నిజంగానే అకాడమీ పురస్కారం దక్కితే మాత్రం టాలీవుడ్ సంబరాలు అంబరాన్ని తాకుతాయి.