త్రివిక్రమ్ కథలన్నీ డిజాస్టర్లే

త్రివిక్రమ్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడు. ఆయన సక్సెస్ రేట్ కూడా బాగా ఎక్కువే. ఐతే రాజమౌళి, సుకుమార్ లాంటి మిగతా స్టార్ డైరెక్టర్లతో పోలిస్తే.. ఆయన సినిమాలు తెలుగు రాష్ట్రాల అవతల పెద్దగా ఆడవు. ఆయన సినిమాల్లో పాన్ ఇండియా టచ్ కనిపించదు. అంతే కాదు.. త్రివిక్రమ్ సినిమాలను వేరే భాషల్లో రీమేక్ చేసినా సరే.. సరైన ఫలితం దక్కదు. రచయితగా ఉన్నప్పట్నుంచి కూడా త్రివిక్రమ్ సినిమాలకు ఇతర భాషల్లో తిరస్కారమే ఎదురవుతుండటం గమనార్హం.

రచయితగా త్రివిక్రమ్ బెస్ట్ మూవీస్‌లో ఒకటైన ‘నువ్వు నాకు నచ్చావ్’ను తమిళంలో విజయ్ హీరోగా ‘వశీకర’ పేరుతో రీమేక్ చేశారు. అదక్కడ పెద్ద డిజాస్టర్ అయింది. ఇక దర్శకుడిగా మారాక త్రివిక్రమ్ తీసిన బెస్ట్ మూవీస్‌లో ఒకటైన ‘అతడు’ను హిందీలో బాబీ డియోల్ హీరోగా ‘ఏక్: ది పవర్ ఆఫ్ వన్’ పేరుతో రీమేక్ చేస్తే ఫ్లాప్ అయింది.

ఆపై త్రివిక్రమ్ సినిమాలు మరి కొన్ని వేరే భాషల్లోకి వెళ్లాయి. ‘జులాయి’ని తమిళంలో ‘సాగసం’ పేరుతో ప్రశాంత్ హీరోగా, ‘అత్తారింటికి దారేది’ని ‘వందా రాజాదా వరువేన్’ పేరుతో శింబు హీరోగా రీమేక్ చేశారు. అవీ చేదు అనుభవాన్నే మిగిల్చాయి. ఇక తాజాగా ఈ జాబితాలో మరో సినిమా చేరింది. త్రివిక్రమ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘అల వైకుంఠపురములో’ను హిందీలో ‘షెజాదా’ పేరుతో రీమేక్ చేస్తే అదీ బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది. త్రివిక్రమ్ సినిమాలు వేరే భాషల్లో ఆడకపోవడానికి కారణాలు లేకపోలేదు. ఆయన సినిమాలు పూర్తిగా తెలుగు నేటివిటీతో తెరకెక్కుతుంటాయి. ఆయన రాసే అందమైన తెలుగు డైలాగులు, మన నేటివిటీతో ముడిపడ్డ హ్యూమరే ఆ చిత్రాలకు హైలైట్‌గా నిలుస్తుంటాయి.

కథల పరంగా త్రివిక్రమ్ మరీ మెరుపులేమీ మెరిపించడు. ఆయన హ్యూమర్ అంతా కూడా డైలాగులు, తెలుగు భాషతోనే ముడిపడి ఉంటుంది కాబట్టి మనవాళ్లు మాత్రమే ఆయన సినిమాలను బాగా ఇష్టపడతారు. కానీ ఇతర భాషల్లో ఈ హ్యూమర్ మిస్సవుతోంది. కథల పరంగా సాధారణంగానే అనిపించడం వల్ల అక్కడి వాళ్లకు ఆ సినిమాలు గొప్పగా అనిపించకపోతుండొచ్చు.