సంక్రాంతి నుంచి స్వంతంగా డిస్ట్రిబ్యూషన్ లోకి అడుగు పెట్టిన మైత్రి మూవీ మేకర్స్ చిన్న సినిమాలను నిర్మించడమే కాదు డబ్బింగ్ చిత్రాలను కూడా తీసుకొస్తోంది. అందులో భాగంగానే కోనసీమ థగ్స్ ని ఈ నెల 24న విడుదల చేయబోతున్నారు.
ఆ రోజు చెప్పుకోదగ్గ రిలీజులేవీ లేకపోవడంతో ఆ అవకాశాన్ని వాడుకోవడానికి రంగం సిద్ధమయ్యింది. జైలు బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ మూవీలో తెలుగు జనాలు గుర్తించే మొహం ఏదైనా ఉందంటే అది బాబీ సింహా ఒక్కడే. మిగిలినదంతా ఆరవ బ్యాచే. హ్రిదు హరూన్ హీరోగా నటించిన ఈ ఇంటెన్స్ డ్రామాలో క్యాస్టింగ్ ఎక్కువే ఉంది.
దీని ట్రైలర్ ఇవాళ విడుదల చేశారు. కరుడు గట్టిన రౌడీలంతా ఒకే జైలులో కలుసుకుంటారు. అక్కడి పరిస్థితులు రోజుకో మలుపు తిరుగుతూ ప్రాణాలను ప్రమాదంలో నెట్టేస్తుంటాయి.
ఊచల వెనుక ఉన్నా బయట దందా నడిపించడంతో చేయి తిరిగిన ఈ గూండాల బ్యాచ్ అంతా తప్పించుకుపోవడానికి ప్లాన్ చేస్తుంది. మృగంలా ప్రవర్తించే పోలీసుల కళ్లుగప్పి వీళ్ళేం చేశారనే పాయింట్ మీద ఈ కోనసీమ థగ్స్ రూపొందించారు. సామ్ సిఎస్ నేపధ్య సంగీతం, కారాగారం విజువల్స్ మాస్ ని ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. నృత్య దర్శకురాలు బృందకు డైరెక్షన్ డెబ్యూ ఇది.
వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సక్సెస్ లతో ఊపు మీదున్న మైత్రికి ఇటీవలే అమిగోస్ డిజాస్టర్ పెద్ద షాక్ ఇచ్చింది. కాకపోతే నష్టం చిన్నది కాబట్టి అంతగా ప్రభావం చెందలేదు కానీ ఇకపై నిర్మాణం పంపిణి రెండూ బాలన్స్ చేసేలా పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నారట.
కేవలం తమ ప్రొడక్షన్ వి మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తే లాభం లేదని గుర్తించి ఇప్పుడీ మార్కెటింగ్ కి తెర తీశారు. సినిమాను అమ్మడం వరకే కాదు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లో ట్రైలర్లు గట్రా పోస్ట్ చేస్తూ ప్రమోషన్లకే సైతం తోడ్పాటు అందిస్తున్నారు. ప్లాన్లైతే గట్టిగానే ఉన్నాయి మరి