ఓటిటి క్యూ కడుతున్న బ్లాక్ బస్టర్లు

సంక్రాంతికి సందడి చేసిన బ్లాక్ బస్టర్లు నేరుగా ఓటిటి ద్వారా ఇళ్లకు వచ్చేస్తున్నాయి. భారీ అంచనాలతో వందల కోట్లు కొల్లగొట్టి కదలకుండా కూర్చున్న చోటే కాలక్షేపం చేయించడానికి ప్రీమియర్లు రెడీ అవుతున్నాయి.

ఇప్పటికే తెగింపు, కళ్యాణం కమనీయం స్ట్రీమింగ్ జరిగిపోగా అసలైనవి మాత్రం ఫిబ్రవరి చివరి వారంలో కనువిందు చేయబోతున్నాయి. విజయ్ వారసుడు అమెజాన్ ప్రైమ్ లో ఫిబ్రవరి 22 నుంచి అందుబాటులోకి రానుంది. తెలుగు వెర్షన్ పెద్దగా జనానికి రీచ్ కాలేకపోవడంతో మన దగ్గర వ్యూస్ భారీగా వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది.

కేవలం ఒక్క రోజు గ్యాప్ తో 23 సాయంత్రం నుంచి వీరసింహారెడ్డి డిస్నీ హాట్ స్టార్ లో వచ్చేస్తుంది. బాలకృష్ణ కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఈ ఫ్యాక్షన్ డ్రామా కొన్ని సెంటర్లు మినహా ఫైనల్ రన్ పూర్తి చేసుకుంది.

అఖండకు వచ్చిన రెస్పాన్స్ దెబ్బకు ఎంత పోటీ ఉన్నా సరే రిలీజ్ కు ముందే క్రేజీ ఆఫర్ తో దీని హక్కులు సొంతం చేసుకున్నారు. పండగ విన్నర్ గా నిలిచిన వాల్తేరు వీరయ్య 27 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఉంటుంది. చిరంజీవి సినిమాలను వరసబెట్టి కొంటున్న ఈ ఓటిటి దీంతో పాటు అంతకు ముందు గాడ్ ఫాదర్, తర్వాత భోళా శంకర్ హక్కులను కూడా కొనేసుకుంది.

ఇవి కాకుండా సుడిగాలి సుధీర్ గాలోడు, బిగ్ బాస్ సోహైల్ లక్కీ లక్ష్మణ్ లాంటివి ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. అటుఇటుగా యాభై రోజులు పూర్తి కాకముందే పెద్ద సినిమాలన్నీ ఓటిటిల వచ్చేస్తున్నాయి. ఆ మధ్య ఎనిమిది వారాల కండీషన్ ని తమకు తాము విధించుకున్న నిర్మాతల మండలి క్షేత్ర స్థాయిలో దాన్ని ఎంత మాత్రం పాటించడం లేదు. ఇండస్ట్రీ రికార్డులు సాధించినవి సైతం 45 రోజులకే పరిమితమైతే ఇక మీడియం ప్రొడ్యూసర్లు ఎక్కడ మాట వింటారు. వీటికి తోడు టైటిల్ కార్డుకు ముందే స్ట్రీమింగ్ పార్ట్ నర్ లోగో వేయకూడదన్న నిబంధనకు సైతం మంగళం పాడేశారు.