వంద రోజులు ఆడేసిన ANR చివరి సినిమా

శతదినోత్సవం అన్న మాట టాలీవుడ్ ఎప్పుడో మర్చిపోయింది. ఇప్ప్పుడంతా మూడు నాలుగు వారాలు ఆడించామా వీలైనన్ని కోట్లు వసూలు చేసుకున్నామా అనే ధోరణి పెరిగిపోవడంతో ఎంత బ్లాక్ బస్టర్ అయినా సరే మహా అయితే యాభై రోజులు చేరుకోవడమే పెద్ద సవాల్ గా మారింది. ఆస్కార్ రేసులో పోటీ పడుతూ జపాన్ లో నెంబర్ వన్ గ్రాసర్ గా నిలిచిన ఆర్ఆర్ఆర్ కు ఇక్కడ హండ్రెడ్ డేస్ లేకపోవడం విచిత్రమే. సంక్రాంతికి అదరగొట్టిన వాల్తేరు వీరయ్య లాంటి కమర్షియల్ ఎంటర్ టైనర్ సైతం ఈ మార్కుని అందుకోవడం దాదాపు అసాధ్యం.

కానీ నిన్నటి తరం హీరోలు ఇలాంటి ఎన్నో సంబరాలు చూశారు. ఎన్టీఆర్ అడవిరాముడు ఏడాది ఆడితే ప్రేమాభిషేకం లాంటివి యాభై వారాలకు పైగానే తిష్ట వేసుకుని కూర్చున్నాయి. చివరి దశల్లో వీళ్ళకు సైతం అలాంటి జ్ఞాపకాలు అరుదైపోయాయి. కానీ అక్కినేని ఫ్యాన్స్ మాత్రం దివంగత ఏఎన్ఆర్ కు ఒక రికార్డు ఉండాలనే ఉద్దేశంలో ముప్పై ఏళ్ళ పాటు ల్యాబ్ లో మగ్గి మూడు దశాబ్దాల తర్వాత రిలీజైన ప్రతిబింబాలును వంద రోజుల మెయిలురాయికి చేర్చారు. ఇప్పటి స్టార్ల వల్లే కానిది ఎప్పుడో లోకం విడిచి వెళ్ళిపోయిన ఒక లెజెండరీ యాక్టర్ కు ఈ నివాళి ఇవ్వడం ఆశ్చర్యమే.

చిత్తూరు జిల్లా అరగొండ అనే చిన్న ఊళ్ళో ప్రతిబింబాలు వంద రోజులు పూర్తి చేసుకుంది. అది పల్లెటూరు కావడంతో రెగ్యులర్ ఆటలు డైలీ రెండు షోలకే కౌంట్ చేసుకుంటారు. ఆ లెక్కన సుమారు రెండు వందలకు పైగా ఆటలతో నాగేశ్వరరావు గారి పేరిట చివరి చిత్రం ఒక సెంటర్ లో హండ్రెడ్ డేస్ ఆడిందన్న లెక్క నిలిచిపోయింది. కె రాఘవేంద్రరావు తండ్రి కె ప్రకాష్ రావుతో పాటు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ప్రతిబింబాలుని కొత్త టెక్నాలజీతో ప్రేక్షకులకు అందించినా సరైన మార్కెటింగ్ లేక జనాన్ని థియేటర్ల దాకా పెద్దగా రప్పించలేకపోయింది.