జగపతిబాబు ‘కమ్మ’ వ్యాఖ్యల రచ్చ


టాలీవుడ్లో చాలా ఓపెన్‌గా, బోల్డ్‌గా మాట్లాడే నటుల్లో జగపతిబాబు ఒకరు. ఆయన సినిమా వేడుకలకు, మీడియాకు చాలా వరకు దూరంగానే ఉంటారు. కానీ ఎప్పుడైనా వేదికలు ఎక్కినా, ముఖ్యంగా ఇంటర్వ్యూలు ఇచ్చినా.. కొంచెం హాట్‌ హాట్‌గానే మాట్లాడతారు. తన కూతురి పెళ్లి, కులం లాంటి విషయాల్లో .జగపతిబాబు గతంలోనే కొంచెం బోల్డ్‌గా మాట్లాడారు.

ఇప్పుడు ఆయన మరోసారి ఈ విషయాలపై ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. జగపతిబాబు పెద్ద కూతురు ఒక విదేశీయుడిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఐతే ఈ పెళ్లి జరిగిన సమయంలో కొందరు ఎన్నారై కమ్మ కులస్థులు తనను బెదిరించినట్లు జగపతిబాబు గతంలో వెల్లడించాడు. ఇదే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించగా.. వాళ్లెవరో వేస్ట్ ఫెలోస్ అన్నట్లుగా మాట్లాడాడు జగపతిబాబు.

తన కూతురు ఒక ఫారినర్‌ను పెళ్లాడితే తనకు, తన కుటుంబానికి లేని అభ్యంతరం వేరే వాళ్లకు ఏంటని జగపతిబాబు ప్రశ్నించాడు. ఈ కుల పిచ్చికి తాను పూర్తి వ్యతిరేకమని.. ఇంట్లో పనివాళ్లు వేరే కులస్థులు కావాలి, ఒక అమ్మాయి దగ్గరికి వెళ్లి పడుకునేటపుడు కులం చూడరు.. కానీ పెళ్లి దగ్గరికి వచ్చేసరికి కులం కావాలా అని జగపతిబాబు ప్రశ్నించాడు.

ఇక కులం విషయంలో తనకు ఎదురైన మరో అనుభవం గురించి చెబుతూ.. ఒకసారి విజయవాడ సిద్దార్థ్ కాలేజీలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లానని.. అప్పుడు ఆ వేదిక మీద తాను కులానికి వ్యతిరేకంగా మాట్లాడబోతానని ప్రిన్సిపాల్‌కు చెప్పానని.. దానికి ఆయన అభ్యంతరం చెప్పారని జగపతిబాబు వెల్లడించాడు. ఆడిటోరియంలో 2 వేల మంది కుర్రాళ్లు ఉంటారని.. వారిలో చాలామంది కమ్మ కుల పిచ్చి ఉన్నవాళ్లని.. కులానికి వ్యతిరేకంగా మాట్లాడితే పీస్‌లు పీస్‌లు చేసేస్తారని ప్రిన్సిపాల్ తనను బెదిరించినా తాను వెనక్కి తగ్గలేదని జగపతి స్పష్టం చేశాడు. తాను కమ్మవారికో, ఏదో ఒక కులానికో వ్యతిరేకం కాదని.. కుల పిచ్చికి వ్యతిరేకం అని జగపతిబాబు స్పష్టం చేశాడు.