పవన్ త్రివిక్రమ్ స్పెషల్ ప్లాన్

ముందుగా అనుకున్న ప్లానింగ్ ప్రకారమైతే ఈ రోజు వినోదయ సితం రీమేక్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ డేట్ల సమస్య వల్ల మళ్ళీ వాయిదా పడింది, పవర్ స్టార్ తో మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న సాయి ధరమ్ తేజ్ ఈ కలయిక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మొన్నో ఈవెంట్ లో అభిమాని ఫోన్లో పదే పదే అడిగినా దాటవేశాడు కానీ అఫీషియల్ గా ప్రకటించే దాకా సైలెంట్ గా ఉండాలని ముందే నిర్ణయం తీసుకున్నాడు. తమిళంలో ఒరిజినల్ వెర్షన్ డీల్ చేసిన సముతిరఖని దర్శకత్వం వహిస్తుండగా భీమ్లా నాయక్ లాగా రచన బాధ్యతలు త్రివిక్రమ్ తీసుకున్నాడు.

ఇదిలా ఉండగా ఈ పాత్ర కోసం పవన్ సన్నబడేందుకు ప్రత్యేకంగా డైట్ ప్లాన్ ఫాలో అవుతున్నారన్న వార్త ఫిలిం నగర్ వర్గాల్లో గుప్పుమంటోంది. నాన్ వెజ్ కూడా మానేసి సన్నబడేందుకు ప్రత్యేకంగా ట్రైనర్ సూచనలు పాటిస్తున్నట్టు తెలిసింది. పోషించేది దేవుడి లాంటి పాత్ర కాబట్టి దానికి అనుగుణంగా శరీరాకృతి ఉండేందుకు సన్నద్ధం చేసుకుంటున్నారట. నిజానికి హరిహర వీరమల్లు లాంటి ప్యాన్ ఇండియా ప్రాజెక్టుకే ఫిజిక్ విషయంలో పవన్ ఇంత కేర్ తీసుకోలేదు. అలాంటిది ఫ్యాన్స్ వద్దుమొర్రో అని డిమాండ్ చేస్తున్న రీమేక్ ఇలాంటి సన్నద్దత అంటే ఆశ్చర్యమే.

దేవుడి పాత్ర కాబట్టి ఇంత శ్రద్ధ తీసుకుంటున్నారనే టాక్ ఉంది నిజానికి వినోదయ సితంలో ఉన్నది మనిషి రూపంలో వచ్చే టైం క్యారెక్టర్. గోపాల గోపాల తరహాలో జనం కొలిచే కృష్ణుడి వేషం కాదు. మరి అలాంటప్పుడు ఇంత స్పెషల్ ఇంటరెస్ట్ అవసరం లేదు. చూస్తుంటే త్రివిక్రమ్ చాలా గట్టి మార్పులే చేసినట్టు కనిపిస్తోంది. పైగా తమిళంలో ఏజ్ బార్ ఆర్టిస్టు తంబీ రామయ్య చేసిన రోల్ ని ఇక్కడ సాయి ధరమ్ తేజ్ తో వేయిస్తున్నారు. అలాంటప్పుడు పూర్తిగా ఎక్కువ పోలికలు రాకుండా ప్లాన్ చేశారు కాబోలు. రెగ్యులర్ షూట్ వచ్చే నెల మొదలుకావొచ్చని సమాచారం.