ప్రభాస్ సినిమా.. చిన్న బడ్జెట్–లో పెద్ద లాభం


బాహుబలి రెండు భాగాలు ఒకదాన్ని మించి ఒకటి భారీ విజయం సాధించి ప్రభాస్‌కు తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్.. మార్కెట్ తెచ్చిపెట్టాయి. ఐతే తర్వాతి సినిమాల విషయంలో బాహుబలితో పోలిక పెట్టుకుని విపరీతంగా బడ్జెట్లు పెంచేశారు. అవసరం లేని హంగులు జోడించారు. కథాకథనాల మీద శ్రద్ధ పెట్టకుండా పరిమితికి మించి బడ్జెట్లు పెట్టడం సాహో, రాధేశ్యామ్ సినిమాలకు చేటు చేసింది. లిమిటెడ్ బడ్జెట్లో ఈ సినిమాలు తీసి ఉంటే రిజల్ట్ తేడా కొట్టినా మంచి లాభాలు దక్కేవి. హీరో మార్కెట్ పెరిగినంత మాత్రాన బడ్జెట్లు హద్దులు దాటిపోకూడదన్న పాఠాలు నేర్పాయి ఈ రెండు చిత్రాలు. అయినా సరే.. ప్రభాస్ కొత్త సినిమాలు ఆదిపురుష్, ప్రాజెక్ట్ కేలకు భారీ బడ్జెట్లే పెట్టారు. ఆ కథల విస్తృతి దృష్ట్యా వాటికి అలా ఖర్చు పెట్టక తప్పదు.

ఇక సలార్ విషయంలో బడ్జెట్ కొంచెం మీడియం రేంజిలో ఉన్నట్లే తెలుస్తోంది. ఇది కాక ప్రభాస్ చేస్తున్నది మారుతి సినిమానే. పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బడ్జెట్ బాగానే అదుపులో ఉన్నట్లు సమాచారం. మారుతి ఎప్పుడూ తన సినిమాలను పరిమిత బడ్జెట్లలోనే తీస్తుంటాడు. ప్రభాస్‌తో సినిమా కాబట్టి కొంచెం రిచ్‌నెస్ పెంచుతున్నాడే తప్ప.. సాహో, రాధేశ్యామ్ సినిమాల మాదిరి అవసరం లేని హంగులైతే జోడించట్లేదట.

ఈ సినిమాకు సంబంధించి ఇటు హీరో, అటు దర్శకుడు పారితోషకాలేమీ తీసుకోవట్లేదట. నిర్మాత, హీరో, దర్శకుడు కలిసి ఒక బడ్జెట్ అనుకుని.. అందులోనే సినిమా తీసి., లాభాలను వారి వారి స్థాయిని బట్టి పర్సంటేజీల రూపంలో పంచుకోవాలని డిసైడైనట్లు సమాచారం. సినిమా అనుకున్న బడ్జెట్లో తీసి, బిజినెస్ అనుకున్న ప్రకారం జరిగితే ప్రభాస్‌ తక్కువ పనికి ఎక్కువ ఆదాయం అందుకునే అవకాశముందట. అభిమానులు వద్దన్నా కూడా ప్రభాస్ ఈ సినిమా చేయడానికి ఇది కూడా ఒక కారణమని సమాచారం.