బాబీ సింహా వసంతకోకిల టాక్ ఏంటి .

కోలీవుడ్ లో మంచి టాలెంటెడ్ యాక్టర్ గా బాబీ సింహాకు పెద్ద గుర్తింపే ఉంది. స్వతహాగా తెలుగు వాడే అయినప్పటికీ అక్కడ రాణించడం మంచి విషయమే. ఇక్కడా బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న టైంలో చిరంజీవి వాల్తేరు వీరయ్యలో వచ్చిన అవకాశం తనకు ఆశించిన స్థాయిలో కాదు కానీ అవకాశాల పరంగా అంచనాలు అందుకుంది. కాకపోతే ఫస్ట్ హాఫ్ కే పరిమితం కావడంతో దర్శకుడికి అతని ఎనర్జీని పూర్తిగా వాడుకునే అవకాశం దక్కలేదు. గతంలోనూ డిస్కో రాజా లాంటి చిత్రాల్లో నటించిన బాబీ సింహా తాజాగా వసంత కోకిల అనే సినిమాతో సోలో హీరోగా ఇవాళ థియేటర్లలో అడుగు పెట్టాడు.

దీని మీద కనీస బజ్ లేదు. స్వయానా చిరంజీవితో ట్రైలర్ లాంచ్ చేయించినా ఆడియన్స్ దృష్టిలో పడలేదు. పైగా బలమైన రిలీజ్ దక్కించుకున్న కళ్యాణ్ రామ్ అమిగోస్ తో పోటీ పడటంతో ప్రమోషన్ చేసినా జనానికి చేరలేదు. ఇదో సైకలాజికల్ కం హారర్ థ్రిల్లర్. ఉద్యోగ జీవితంతో విసుగొచ్చిన ఓ యువకుడు తన ప్రేయసిని తీసుకుని ఏకాంతంగా ఎంజాయ్ చేయడానికి బయటికి వెళ్తాడు. అలా అనుకోకుండా ప్రయాణం మధ్యలో ఓ అడవిలో వసంత కోకిల అనే హోటల్ లో ఆగాల్సి వస్తుంది. అక్కడ ఈ జంటకు అనూహ్యమైన పరిణామాలు ఎదురవుతాయి. మెయిన్ పాయింట్ ఇదే.

దర్శకుడు రమణన్ పురుషోత్తమ నెరేషన్ కొంత అయోమయంగా కొంత ఖంగాళీగా ఉండటంతో వసంత కోకిలలో థ్రిల్ తక్కువ కిల్ ఎక్కువ అయిపోయింది. ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగానే డిజైన్ చేసుకున్నప్పటికీ దాని ముందు వెనుకా నడిపించాల్సిన కంటెంట్ బలంగా లేకపోవడంతో ఆడియన్స్ కి నీరసం వచ్చేస్తుంది. ఆర్య స్పెషల్ క్యామియో పెద్దగా ఉపయోగపడలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుని హీరోగా అంగీకరించాలంటే ఆషామాషీ రొటీన్ కథలతో పనవ్వదు. కానీ బాబీ సింహా రిస్క్ చేశాడు కానీ వసంత కోకిల సోలో హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలన్న అతని కోరిక నెరవేర్చేలా మాత్రం లేదు.