సాహసం చేసి యుద్ధం గెలిచిన మైత్రి

ఒక పెద్ద సినిమాని పూర్తి చేసి అనుకున్న టైంకి విడుదల చేయడమే సవాల్ గా మారుతున్న ట్రెండ్ లో ఇద్దరు సీనియర్ అగ్ర హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలు తీసి వాటిని కేవలం ఒక రోజు గ్యాప్ తో రిలీజ్ అంటే అంతకు మించిన రిస్క్ మరొకటి ఉండదు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలకు సంబంధించి మైత్రి మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు సంక్రాంతి ముందు వరకు దీని మీద చాలా హాట్ డిబేట్స్ నడిచాయి. వీటికి తోడు దిల్ రాజు వారసుడుని భారీ ఎత్తున్న ప్లాన్ చేసుకోవడం, మైత్రి స్వంతంగా డిస్ట్రిబ్యూషన్ లోకి దిగడం ఇలా రకరకాల పరిణామాలు వాతావరణాన్ని వేడెక్కించాయి .

ఎట్టకేలకు ఎలాంటి అడ్డంకులు అసంతృప్తి లేకుండా రెండూ విజయం సాధించాయి. లిరికల్ వీడియోలతో మొదలుపెట్టి సక్సెస్ మీట్ ల దాకా ఎవరికి ఎక్కువ తక్కువ చేయకుండా సమన్యాయం పాటిస్తూ అభిమానులను సంతృప్తి పరచడమంటే చిన్న విషయం కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా ఫ్యాన్స్ ప్రొడక్షన్ ఆఫీస్ కు వచ్చి మూకుమ్మడిగా దాడులు నిరసనలు చేసే ప్రమాదం ఉంది. అలాంటివి మచ్చుకు కూడా కనిపించకుండా మేనేజ్ చేయడం పెద్ద ఆర్ట్. మైత్రి అధినేతలు అంత విపరీతమైన ఒత్తిడిని నెగ్గుకురావడం, పంపిణిరంగం గుత్తాధిపత్యాన్ని ఎదురుకున్న వైనం మరికొందరికి స్ఫూర్తినిస్తోంది.

వసూళ్ల లెక్కల్లో చిరంజీవిదే పైచేయి అయినప్పటికీ సంక్రాంతి సీజన్ అడ్వాంటేజ్ గా వాడుకుని బాలయ్య కూడా కలెక్షన్ల వర్షం కురిపించి కెరీర్ హయ్యెస్ట్ రాబట్టుకున్నారు. ఈ ఇద్దరి సినిమాలకూ పండగ కలిసి వచ్చిన మాట వాస్తవం. అపోజిషన్ వీక్ గా ఉండటంతో రెండు వారాల పాటు థియేటర్లను నింపేశారు. మెల్లగా మైత్రి థియేటర్లను లీజుకు తీసుకునే వ్యవహారం కూడా మొదలుపెట్టినట్టు ఇన్ సైడ్ టాక్. ఇది కూడా జరిగితే భవిష్యత్తులో స్క్రీన్ల పంపకాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. చేతిలో ఉన్నవన్నీ భారీ సినిమాలు కావడంతో ఈ మాత్రం ప్లానింగ్ కావాల్సిందే.