ఆమిర్‌కేమో అలా.. షారుఖ్ ఖాన్ కేమో ఇలా


బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ హవా తగ్గాక ఖాన్ త్రయానిదే ఆధిపత్యం. 90వ దశకంలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ వరుస విజయాలతో పెద్ద స్టార్లుగా ఎదిగారు. ఐతే ఫిలిం బ్యాగ్రౌండ్‌తో వచ్చిన సల్మాన్, ఆమిర్‌లను మించి.. సొంతంగా ఎదిగిన షారుఖే ఒక టైంలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించాడు. బాజీఘర్ సహా కొన్ని సెన్సేషనల్ హిట్లతో షారుఖ్ తన రేంజ్ పెంచుకున్నాడు. అతడి ముందు ఆమిర్ రేంజ్ తక్కువగా ఉండేది. కానీ 2000 తర్వాత పరిస్థితి మారింది. ‘లగాన్’ దగ్గర్నుంచి ఆమిర్ ఇంతింతై అన్నట్లు ఎదిగిపోయాడు. షారుఖ్, సల్మాన్‌లను దాటి పెద్ద రేంజికి వెళ్లిపోయాడు.

షారుఖ్ స్థాయికి తగ్గ సినిమాలు చేయకపోవడంతో అతడి మార్కెట్ బాగా దెబ్బ తినేసింది. ఓవైపు ‘లగాన్’ తర్వాత ఆమిర్ రంగ్ దె బసంతి, 3 ఇడియట్స్, పీకే, దంగల్ లాంటి మెగా హిట్లతో తిరుగులేని స్థాయిని అందుకుంటే.. షారుఖ్ ‘ఓం శాంతి ఓం’ మినహా సరైన హిట్ లేక చతికిలపడ్డాడు.

ఆమిర్ ముందు షారుఖ్ అస్సలు నిలబడలేని పరిస్థితి తలెత్తింది. ఆమిర్ ‘దంగల్’తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొడితే అదే టైంలో డియర్ జిందగీ, రయీస్, జబ్ హ్యారీ మెట్ సెజాల్, జీరో లాంటి డిజాస్టర్లు ఇచ్చి కెరీర్లో ఘోరమైన పతనాన్ని చవిచూశాడు షారుఖ్. మరోవైపు సల్మాన్ వీళ్లిద్దరికీ మధ్య ఓ మోస్తరు స్థాయిలో సాగిపోతుంటే.. ఆమిర్, షారుఖ్‌ల మధ్య అంతరం మాత్రం బాగా పెరిగిపోయింది. కొన్నేళ్ల ముందు ఇద్దరి మధ్య పరిస్థితి అలా ఉంటే.. ఇప్పుడు పూర్తిగా తలకిందులైంది.

గత ఏడాది ఆగస్టులో రిలీజైన ఆమిర్ సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’ బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఒకప్పుడు ఆమిర్ సినిమాలు తొలి రోజు రాబట్టే వసూళ్లను ఈ చిత్రం ఫుల్ రన్లో అందుకుందంటే పరిస్థితి అర్థ: చేసుకోవచ్చు. ఆ సినిమా రిలీజ్ ముందు సోషల్ మీడియాలో జరిగిన నెగెటివ్ ప్రచారం బాగానే చేటు చేసింది. షారుఖ్ సినిమా ‘పఠాన్’కు సైతం ఇలాంటి ప్రచారమే జరిగింది కానీ.. అదేమీ సినిమా మీద పెద్దగా ప్రభావం చూపలేదు. ఇది రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ఆమిర్ సినిమా ఫుల్ రన్ వసూళ్లను ఒక్క రోజులో అందుకుని మెగా బ్లాక్‌బస్టర్ దిశగా అడుగులు వేస్తోంది ‘పఠాన్’. ఆమిర్-షారుఖ్ పరిస్థితి ఇలా మారిపోతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు.