చిన్న సినిమాలను జనం దాకా తీసుకెళ్లడం నిర్మాతలకు పెద్ద సవాల్ గా మారింది. కరోనా తర్వాత భారీతనం ఉంటే తప్ప ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు కదలడం లేదు. 2020 తర్వాత వచ్చిన ఫలితాలను చూస్తే అర్థం చేసుకోవచ్చు. అలా అని కంటెంట్ ఉన్న వాటిని ఆదరించకుండా పోరు. కాకపోతే ప్రమోషన్ల విషయంలో దర్శక నిర్మాతలు మంచి ప్లానింగ్ తో జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా హిట్టు కొట్టే అవకాశాలు పెరుగుతాయి. వచ్చే నెల 3న విడుదల కాబోతున్న రైటర్ పద్మభూషణ్ టీమ్ అదే పనిలో ఉంది. రిలీజ్ కు ఇంకా వారం ఉండగానే ప్రధాన నగరాల్లో స్పెషల్ స్క్రీనింగ్స్ ప్లాన్ చేస్తోంది.
విజయవాడ, గుంటూరు, భీమవరం, కాకినాడ, విశాఖపట్నం, హైదరాబాద్ లలో ఈ రోజుతో మొదలుపెట్టి ఫిబ్రవరి 1 దాకా కాలనీలను సందర్శించడంతో పాటు వాళ్లకు సినిమాను ప్రదర్శించబోతున్నారు. గతంలో మేజర్ కు ఇదే తరహా స్పెషల్ ప్రీమియర్స్ దేశవ్యాప్తంగా వేస్తే అద్భుతమైన స్పందన దక్కింది. వాటికొచ్చిన సోషల్ మీడియా ఫీడ్ బ్యాక్ ఓపెనింగ్స్ కి చాలా సహాయపడింది. సినిమాలో ఎంత బలమైన ,మ్యాటర్ ఉన్నా రీచ్ విషయంలో ఇలాంటి కేర్ అవసరం. 777 చార్లీకి సైతం ఇదే స్ట్రాటజీని వాడితే అదీ గొప్ప ఫలితాన్ని అందుకుంది. ఒకటి రెండు తప్ప ఇలా చేసినవన్నీ హిట్లే.
ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ వంతు వచ్చింది. ఆర్టిస్టుగా సుహాస్ కు మంచి పేరుంది కానీ థియేటర్ కు జనాన్ని ఫుల్ చేసే స్థాయికి ఇంకా చేరుకోలేదు. కలర్ ఫోటోకి జాతీయ అవార్డు వచ్చినా మిలియన్ల వ్యూస్ దక్కించుకున్నా ఓటిటి రిలీజ్ కావడంతో దాని బిజినెస్ రేంజ్ అర్థం కాలేదు. పూర్తిగా తన మీదే మార్కెట్ అవుతున్న మొదటి సినిమా ఈ పద్మభూషణ్. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో దాన్ని క్యాష్ చేసుకునే పనిలో ఉంది నిర్మాణ సంస్థ. మేజర్ కు ఎవరైతే సారథ్యం వహించారో వాళ్ళే దీనికీ బాధ్యత తీసుకోవడంతో మెల్లగా హైప్ పెరుగుతోంది. మైఖేల్ బుట్టబొమ్మ పోటీని తట్టుకోవడానికి ఇవి చేయడం అవసరమే.