వీర‌య్య ఊచకోత‌

ఈసారి సంక్రాంతి విజేత వాల్తేరు వీర‌య్యనే అనే విష‌యం తొలి వీకెండ్లోనే స్ప‌ష్టంగా తెలిసిపోయింది. తొలి రోజు నుంచి వ‌సూళ్ల మోత మోగిస్తూ సాగిపోయిన ఈ చిత్రం.. పండుగ సెల‌వుల‌ను గొప్ప‌గా ఉప‌యోగించుకుంది.

శుక్ర‌వారం మొద‌లుకుని క‌నుమ సెల‌వు అయిన సోమ‌వారం వ‌ర‌కు హౌస్ ఫుల్ వ‌సూళ్ల‌తో ర‌న్ అయిన Waltair Veerayya.. మంగ‌ళ‌వారం నుంచి కొంచెం జోరు త‌గ్గించింది. త‌ర్వాత రెండు మూడు రోజులు ఒక‌ మోస్త‌రు వ‌సూళ్లు వ‌చ్చాయి. కానీ వీకెండ్ వ‌చ్చేస‌రికి మ‌ళ్లీ వీర‌య్య జోరు పెరిగింది. శనివారం సాయంత్రం నుంచి మ‌ళ్లీ హౌస్ ఫుల్ బోర్డులు ప‌డిపోయాయి.

ఆదివారం అయితే చిరు సినిమా దూకుడు మామూలుగా లేదు. కొత్త సినిమా స్థాయిలో మెజారిటీ ఏరియాల్లో ప్యాక్డ్ హౌస్‌ల‌తో న‌డిచింది ఆదివారం. ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర‌, గోదావ‌రి జిల్లాల్లో అయితే వాల్తేరు వీర‌య్య ఊపు మామూలుగా లేదు.

ఉత్త‌రాంధ్ర‌లో ఈ సినిమాను ఉద్య‌మంలా చూస్తున్న‌ట్లున్నారు జ‌నం. వీర‌య్య పాత్ర‌కు, చిరు పెర్ఫామెన్స్‌కు బాగా క‌నెక్ట్ అయిపోయిన జ‌నాలు.. విర‌గ‌బ‌డి థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారు. వైజాగ్, గోదావ‌రి జిల్లాల్లో ఆదివారం ఫ‌స్ట్, సెకండ్ షోల‌కు ఎక్క‌డా టికెట్ ముక్క మిగ‌ల్లేద‌న్న‌ది ట్రేడ్ వ‌ర్గాల టాక్.

చిరు రీఎంట్రీలో రెండో వారంలో ఇంత ఊపు ఏ సినిమాకూ చూడ‌లేద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. మిగ‌తా ఏరియాల్లో కూడా ఆదివారం వాల్తేరు వీర‌య్య మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఐతే సోమ‌వారం నుంచి మాత్రం సినిమా వ‌సూళ్లు బాగా డ్రాప్ అవ‌డం గ్యారెంటీ.

అయినా స‌రే.. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయి బ‌య్య‌ర్ల‌కు మంచి లాభాలే అందించింది. ఈ సినిమాను న‌మ్ముకున్న అంద‌రూ హ్యాపీ అన్న‌మాటే.