తన చిన్ననాటి అభిమాన హీరో బాలకృష్ణను దర్శకత్వం చేయాలనే కలను వీరసింహారెడ్డి ద్వారా గోపీచంద్ మలినేని తీర్చేసుకున్నాడు. పోటీలో ఉన్న సినిమాను దాటలేదనే విషయం పక్కనపెడితే రెండు వారాల లోపే అఖండ ఫుల్ రన్ ని దాటించడం ద్వారా బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని కానుకగా ఇచ్చాడు. ముఖ్యంగా ఎలివేషన్ల విషయంలో ఫస్ట్ హాఫ్ ని డీల్ చేసిన విధానం అభిమానులకు బాగా నచ్చేసింది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సిస్టర్ సెంటిమెంట్, వయొలెన్స్ విషయంలో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండి ఉంటే వంద కోట్ల మార్కుని తేలికగా అందుకునే ఛాన్స్ ఉందని ఫాన్స్ ఫీలవుతున్నారు.
ఇదంతా ఎలా ఉన్నా మూవీ సక్సెస్ అయ్యింది కాబట్టి ఆ ఆనందం ఇచ్చే కిక్ ముందు ఇలాంటివి చిన్నవిగానే కనిపిస్తున్నాయి. దీని ప్రమోషన్లలో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో మలినేని పలు ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నాడు. అందులో మొదటిది భీమ్లా నాయక్ ఆఫర్. మళయాలం సూపర్ హిట్ అయ్యప్పనుం కోశియుమ్ ని తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు డైరెక్షన్ కోసం మొదటి పిలుపు వెళ్ళింది గోపీచంద్ మలినేనికే. క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సరైన అవకాశం ఎదురు చూస్తున్న ఇతనికి అదెందుకో ముందుకు వెళ్లలేకపోయింది. ఈలోగా వీరసింహారెడ్డి ఆఫర్ తలుపు తట్టింది.
మలినేనికి తెలియని ఏవో కారణాల వల్ల భీమ్లా నాయక్ సాగర్ కె చంద్రకు వెళ్లిపోయింది. ఇదే కాదు మరికొన్ని విశేషాలు పంచుకున్న గోపీచంద్ క్రాక్ విడుదల రోజు ఆర్థిక కారణాల వల్ల రిలీజ్ ఆలస్యమైతే తనకు రావాల్సిన డెబ్భై అయిదు లక్షల బాకీని అడగకుండా ముందు ల్యాబ్ నుంచి బయటికి వచ్చేందుకు కష్టపడ్డానని చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ ఆ మొత్తం పూర్తిగా అందకపోయినా మరో రూపంలో దేవుడు ఇస్తాడనే నమ్మకంతో అంత రిస్క్ చేసినట్టు వివరించాడు. సక్సెస్ ఉన్న డైరెక్టర్లకు అసలెలాంటి సమస్యలు ఉండవనుకుంటాం కానీ ఈ ఉదాహరణ చూస్తే అర్థమైపోదు తెరవెనుక ఇబ్బందులు ఏ స్థాయిలో ఉంటాయో.