సంక్రాంతి స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అన్ని సినిమాల్లో విలన్లు మరీ రొటీన్ గా కనిపిస్తూ ఆడియన్స్ కి బోర్ కొట్టించారు. ముఖ్యంగా చిరు ‘వాల్తేరు వీరయ్య’ లో అలాగే ‘వారసుడు’ లో ప్రకాష్ రాజ్ విలన్ గా కనిపించాడు. రెండిటిలో రొటీన్ విలనిజం చూపించి నటుడిగా మంచి మార్కులు అందుకోలేక పోయాడు. వాల్తేరు వీరయ్య లో ప్రకాష్ రాజ్ విలన్ కేరెక్టర్ చూస్తే ఖలేజా , టెంపర్ సినిమాలు గుర్తొచ్చాయి. ప్రకాష్ రాజ్ ను త్రివిక్రమ్ ఎప్పుడో స్టైలిష్ విలన్ గా చూపించాడు. అంతకంటే ముందే చాలా మంది దర్శకులు ప్రకాష్ ను స్టైలిష్ విలన్ గా ప్రెజెంట్ చేశారు. గుణ శేఖర్ ‘చూడాలని ఉంది’ లో ప్రకాష్ రాజ్ అలానే కనిపించాడు.
ఇక వారసుడు సినిమా చూస్తే ఓ బిజినెస్ మెన్ గా మళ్ళీ అదే రొటీన్ స్టైలిష్ విలన్ గా కనిపించాడు ప్రకాష్ రాజ్. ముఖ్యంగా ఈ కేరెక్టర్ చూస్తే లక్ష్మి సినిమాలో సాయాజీ షిండే పాత్ర గుర్తుకు రావడం పక్కా. అయితే ఈ విషయంలో ప్రకాష్ రాజ్ ని తప్పు పట్టలేం. దర్శకుడు రాసిందే ఆయన రెమ్యూనరేషన్ తీసుకొని నటిస్తాడు. ఇన్నేళ్లవుతున్నా అదే రొటీన్ విలనిజం చూపించే క్యారెక్టర్ డిజైన్ చేస్తున్న దర్శకులదే అసలు తప్పంతా. అవును బాబీ , వంశీ పైడిపల్లి లాంటి దర్శకులు ప్రకాష్ రాజ్ రొటీన్ విలన్ గా వాడుకోవడం వాళ్ళ తప్పే.
ఇక వీర సింహా రెడ్డి లో కూడా విలన్ కేరెక్టర్ రొటీన్ అనిపించి ‘విక్రమార్కుడు’ లో బావుజీ ను గుర్తుచేసింది. అక్కడ వినీత్ తో అతని కొడుకు తో రాజమౌళి తీసిన రేప్ సీన్ , హీరో ఎలివేషన్ సీన్ నే గోపీచంద్ మాలినేని వాడుకోవడం చూస్తే దర్శకులు ఇంకెన్నాళ్ళు అవే రాసుకుంటారు అనిపించక మానదు. ఏమైనా విలనిజంలో కొత్తదనం చూపించే పాత్రలు డిజైన్ చేసుకుంటే ఆడియన్స్ ను యాక్షన్ ఎపిసోడ్స్ ను బాగా ఎంజాయ్ చేస్తారు లేదంటే రొటీన్ అంటూ మాట్లాడుకుంటారు. మరి దర్శకులు ఇకపై అయినా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని మంచి విలన్ పాత్రలను డిజైన్ చేసుకుంటే బాగుంటుంది.